వ‌కీల్ సాబ్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఏప్రిల్‌లో బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు వ‌స్తున్న ప‌వ‌ర్ స్టార్

రాజ‌కీయాల‌లోకి వెళ్లిన త‌ర్వాత సినిమాలు మానేసిన ప‌వ‌న్ అభిమానుల‌ని చాలా నిరూత్సాహ ప‌రిచాడు. ఆయ‌నను ఇక వెండితెర‌పై చూడ‌లేమో అని అభిమానులు ఎంతో నిరూత్సాహ‌ప‌డ్డారు. కాని అంద‌రు ఆశ్చ‌ర్య‌పోయేలా తిరిగి సెకండ్ ఇన్నింగ్స్ మొద‌లు పెట్టిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌రుస సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ని అల‌రించేందుకు సిద్ధ‌మయ్యాడు. హిందీ మూవీ పింక్‌కు రీమేక్‌గా వ‌కీల్ సాబ్ అనే చిత్రాన్ని మొద‌లు పెట్టిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆ త‌ర్వాత క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం, సాగ‌ర్ కె చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం, హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌కత్వంలో ఓ సినిమా చేయ‌నున్నారు .

ప‌వ‌న్ సినిమా కోసం క‌ళ్ళార్ప‌గించి చూస్తున్న అభిమానులకు క‌రోనా బ్రేక్ వేసింది. కరోనా లేక‌పోయి ఉంటే వ‌కీల్ సాబ్ చిత్రం ఎప్పుడో బాక్సాఫీస్ ద‌గ్గర విడుద‌లై మంచి విజ‌యం సాధించి ఉండేది. క‌రోనాతో ఈ చిత్రానికి తాత్కాలిక బ్రేక్ ప‌డ‌గా, లాక్‌డౌన్ త‌ర్వాత మిగ‌తా పార్ట్ షూటింగ్ పూర్తి చేశారు. సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడా ఎన్న‌డా అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు మేకర్స్ ఆనందాన్ని నింపారు. ఏప్రిల్ 9న వ‌కీల్ సాబ్ చిత్రాన్ని థియేట‌ర్స్‌లోకి తీసుకురానున్న‌ట్టు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఈ వార్త‌తో అభిమానుల ఆనందం అవ‌ధులు దాటింది.

వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌కీల్ సాబ్ చిత్రం తెర‌కెక్క‌గా, ఈ మూవీని దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు నేటివిటీతో పాటు పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కు అనుగుణంగా వ‌కీల్ సాబ్‌ సినిమాలో భారీ మార్పులు చేర్పులు చేసి కమర్షియల్ హంగులతో ఈ సినిమాను తెరకెక్కించారు. చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. మరో ముఖ్యపాత్రల్లోఅంజలి, నివేదా థామస్ నటిస్తున్నారు.