దేశ వ్యాప్తంగా కరోనా సృష్టిస్తున్న ప్రళయం అంత ఇంత కాదు. అయితే కొందరు దీనిని తమకు అనుకూలంగా మలుచుకొని వ్యాపారాలు చేసుకుంటూ లాభపడుతున్నారు. ఇప్పుడు తాజాగా రాజకీయ నేతలు కూడా కరోనాను తమకు అనుకూలంగా మలుచుకునే పనిలో పడ్డారు. లాక్ డౌన్ తర్వాత దేశంలో మొదటి ఎన్నికలు బీహార్ లో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో అందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇస్తామని హామీ ఇచ్చింది.
కరోనాపై ప్రజల్లో ఉన్న భయాన్ని… దాని నుంచి కాపాడతామే భరోసా ఇచ్చి ఓట్లు దండుకునే ప్రయత్నం బీజేపీ చేసింది. రాబోయే ఒకటిరెండేళ్ళల్లో కరోనాకు అసలైన వ్యాక్సిన్ వస్తుందా లేదా అనే అనుమానాలు వున్నాయి. అందరి కంటే ముందుగా వ్యాక్సిన్ తయారుచేశామని చెప్పుకున్న రష్యా కూడా ఇప్పటివరకు వ్యాక్సిన్ ను ప్రజలకు ఇచ్చిన దాఖలాలు లేవు. ఇక ఇండియా లో కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందో కూడా చెప్పలేని పరిస్థితి, ఇప్పట్లో టీకా కష్టమే అంటూ శాస్త్రవేత్తలు నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారు. ఒక వేళ వచ్చిన కానీ, మనకున్న పరిస్థితుల దృష్ట్యా అందరికి వెంటనే వ్యాక్సిన్ అందించలేని స్థితి.
ఇలా అనేక సమస్యలు కనిపిస్తున్న కానీ, ఓట్లు కోసం కరోనా వ్యాక్సిన్ ను ఫ్రీ వేస్తామని చెప్పుకొని ఓట్లు అడగటం శవాల మీద పేలాలు ఏరుకోవటం ఒకటే, మరి బిహారి ప్రజలు బీజేపీ వాళ్లకు అంత వెర్రిబాగుల మాదిరి కనిపిస్తున్నారా..? కరోనా వ్యాక్సిన్ ఫ్రీ అనగానే గుంపగుత్తుగా ఓట్లు వేయటానికి, అయినా ఈ విధమైన హామీలు ఇవ్వాలని బీజేపీ కి ఎలా అనిపించిందో ఏమో. ఇక దీనిపై కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్ర విమర్శలు చేస్తుంది. కరోనా వ్యాక్సిన్ అనేది ఇప్పటి వరకు రాలేదు. పైగా దానిని ప్రజలందరికి పంచవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి వుంది, దానిని ఏ విధంగా ప్రచారం కోసం వాడుకుంటారని కాంగ్రెస్ వాదిస్తుంది. బీజేపీ మాత్రం తాము ఇచ్చిన హామీలో ఎలాంటి తప్పు లేదని, ప్రజలుకు బాగా నచ్చిన హామీనే ఇచ్చామని గొప్పలు చెప్పుకోవటం విశేషం