Vaccine: 18 ఏళ్ళ వయసు పైబడినవారందరికీ మే 1 నుంచి వ్యాక్సిన్.. అంటూ కేంద్రం ఇటీవల గొప్పగా ప్రకటించింది. కానీ, ఏదీ.? ఎక్కడ.? 45 ఏళ్ళ వయసు పైబడిన వాళ్ళకే పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ దొరకని పరిస్థితి. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. వ్యాక్సిన్ కొరతకు సంబంధించి ఒక రాష్ట్రంతో ఇంకో రాష్ట్రం పోటీ పడుతోంది. పెద్దయెత్తున వ్యాక్సిన్లు అవసరమంటూ కేంద్రానికి, వ్యాక్సిన్ తయారీ సంస్థలకీ తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు విజ్నప్తి చేస్తున్నాయి.
కేంద్రం కొన్ని వ్యాక్సిన్లను సమకూరుస్తున్నా, అవి తెలుగు రాష్ట్రాల అవసరాలకు సరిపడా లేవు. వ్యాక్సిన్లు వచ్చినవి వచ్చినట్లే అయిపోతున్నాయి. మొదటి డోసు టీకా, రెండో డోసు టీకా.. ఇలా రెండు సార్లు టీకా ఇవ్వాల్సిన నేపథ్యంలో, కొత్తవారికి వ్యాక్సిన్లు అందడం గగనమైపోయింది. మొదట్లోనే వ్యాక్సిన్ కోసం జనం ముందుకు వచ్చి వుంటే, ఇప్పుడీ పరిస్థితి వుండేది కాదన్న వాదనలూ లేకపోలేదు.
ఇదిలా వుంటే, మే 1 నుంచి 18 ఏళ్ళ పైబడినవారందరికీ (45 ఏళ్ళు పైబడినవారికి ఉచిత వ్యాక్సిన్.. 18 నుంచి 45 ఏళ్ళ వారికి కొన్ని రాష్ట్రాలు మాత్రమే ఉచితంగా వ్యాక్సినేషన్ ప్రకటించాయి) వ్యాక్సిన్ అందే పరిస్థితులు కనిపించడంలేదు. వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటే, కేంద్రం అస్సలేమాత్రం ఆలోచన లేకుండా ఈ ప్రకటన చేసిందనే అభిప్రాయం కలగకమానదు.
గతంలో కూడా, వ్యాక్సిన్ ఉత్సవాన్ని ప్రారంభించి.. అవసరమైన మేర వ్యాక్సిన్లు సమకూర్చేలక చేతులెత్తేసింది కేంద్రం. ఇదేం అడ్మినిస్ట్రేషన్.? అంటూ మోడీ సర్కార్ మీద సామాన్యుడు విరుచుకుపడే పరిస్థితులు దాపురిస్తున్నాయి. వ్యాక్సిన్ ఓ డోసు వేసుకున్నా, కరోనా వైరస్ నుంచి కొంత మేర ఉపశమనం పొందవచ్చునని పలు అధ్యయనాలు చెబుతున్న దరిమిలా, కేంద్రం.. వ్యాక్సినేషన్ విషయమై బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి వుంది.