ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమిళంలోకి ఏంట్రీ ఇవ్వాలని చాన్నాళ్ళ నుండి అనుకుంటున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ లింగుస్వామితో చాలా రోజులు ట్రావెల్ చేశారు. సినిమా లాంఛ్ కూడ అయింది. కానీ ఆ ప్రాజెక్ట్ మధ్యలోనే ఆగిపోయింది. కథ అంతగా నచ్చక అల్లు అర్జున్ వెనక్కి తగ్గారని వార్తలొచ్చాయి. దీంతో లింగుస్వామి అదే కథను తీసుకెళ్లి హీరో రామ్ ను కలవడం, రామ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయి. ఈ కథ పట్ల రామ్ చాలా ఎగ్జైట్ అవుతున్నాడు కూడ. అయితే అల్లు అర్జున్ తమిళ దర్శకుల వేట ఆపలేదు. ఆ వేటలోనే ఆయనకు ఇంకొక దర్శకుడు తగిలినట్టు తెలుస్తోంది. ఆ దర్శకుడు కూడ ఫామ్లో ఉన్న స్టార్ దర్శకుడేనని సమాచారం.
ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్.థాను నిర్మించనున్నారు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయట. ఇప్పుడు విజయ్ ఎలాగైతే తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లితో ద్విభాషా చిత్రం చేస్తున్నారో అల్లు అర్జున్ కూడ అలాగే తమిళ దర్శకుడితో ద్విభాషా చిత్రం చేస్తాడట. ఈ సినిమాతో తమిళంలో కూడ మార్కెట్ ఏర్పరుచుకోవాలనేది అల్లు అర్జున్ ఆలోచన. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ మీద అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ను పూర్తిచేసే పనిలో ఉన్నారు. అది పూర్తవ్వగానే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘ఐకాన్’ చిత్రాన్ని స్టార్ట్ చేస్తారు. దాని తర్వాత ‘పుష్ప-2’ చేయనున్నారు. బహుశా ఈ సినిమా తరువాత తమిళ దర్శకుడి సినిమా ఉండొచ్చు.