సభ్య సమాజం సిగ్గుతో తలదించుకుంటోంది.. ఇలాంటి రాజకీయ నాయకుల్నా మనం చట్ట సభలకు పంపుతున్నది.? అన్న ఆవేదనతో. అయినాగానీ, రాజకీయ నాయకులు అస్సలేమాత్రం మారడంలేదు. మారరుగాక మారరు. పదవుల మీద కక్కుర్తి కారణంగానే ఇదంతా చేస్తున్నారా.? అంటే, నో డౌట్.. అదే నిజం.. అనుకోవాలేమో. రాజకీయాల్లో విమర్శలు సహజం. దానికి ప్రతి విమర్శ కూడా తప్పదు. అయినాగానీ, నాయకులు.. అందునా ప్రజా ప్రతినిథులు తమ స్థాయిని మర్చిపోతే ఎలా.? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ బూతు పురాణం ఎంత జుగుప్సాకరంగా వుందో అందరికీ తెలిసిందే. టీడీపీ వర్సెస్ వైసీపీ.. అత్యంత ఛండాలంగా అక్కడ రాజకీయ యుద్ధం నడుస్తోంది. తామేం తక్కు తిన్లేదంటూ తెలంగాణ నేతలూ తమ నోళ్ళకు పని చెబుతున్నారు.
మంత్రి మల్లారెడ్డి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీద తిట్ల దండకం అందుకున్నారు. అరెయ్.. ఒరెయ్.. అంటూ విరుచుకుపడిపోయారు. రేవంత్ గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్ర సమితిపై తీవ్రస్థాయి ఆరోపణలు చేస్తున్న విషయం విదితమే. ‘ఓపిక నశించింది.. ఇకపై సంయమనం పాటించేది లేదు..’ అంటూ గులాబీ నేతలు తమ సత్తా చాటేస్తున్నారు తిట్ల దండకం విషయంలో. మల్లారెడ్డి, రేవంత్ రెడ్డి.. ఒకప్పుడు ఒకే పార్టీలో వున్నారు. ఇప్పుడు.. ఇద్దరూ ఆ పార్టీలో కాకుండా వేర్వేరు పార్టీల్లో వున్నారు. రేప్పొద్దున్న ఇద్దరూ కలిసి మరో పార్టీలో కనిపించొచ్చు. ఇప్పుడున్న రాజకీయాలే అంత. కానీ, ఈ తిట్ల దండకమేంటి.? అధినేత మెప్పు కోసమేనా.? రాజకీయంగా తమ ప్రాపకం పెంచుకోవడానికా.? నో డౌట్, మీడియాకి సెన్సార్ వుండి తీరాల్సిందే. లేదంటే, భావితరాలకు ఇలాంటి నేతల్ని చూపించేంత సాహసం.. ప్రజెలవరూ చెయ్యలేరు మరి.