పవన్ కళ్యాణ్ స్కెచ్ వేసుకుని మరీ, రిపబ్లిక్ సినిమా ఈవెంట్ ద్వారా రాజకీయాలు మాట్లాడాలనుకున్నారనే చర్చ సినీ పరిశ్రమలో జరుగుతోంది. సినిమాకి సంబంధించిన కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ ఎందుకు రాజకీయాలు ప్రస్తావించారు.? అన్న ప్రశ్న అయితే సినీ పరిశ్రమలో వ్యక్తమవుతోంది. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ తీరుని కొందరు తప్పుపడుతున్నారు కూడా. అదే సమయంలో, పవన్ లేవనెత్తిన సినిమా సమస్యలపై మాత్రం సానుకూల స్పందన వ్యక్తమవుతోంది. ‘మన సమస్యల్ని.. పరిశ్రమలో ముఖ్యులైనవారు పట్టించుకోవడంలేదు. పవన్ ప్రస్తావిస్తే, ఆయన స్థాయిని తగ్గించేలా కొందరు వ్యవహరిస్తున్నారు..’ అంటూ సినీ పరిశ్రమకు చెందిన పలు విభాగాల్లో చర్చించుకుంటున్నారు. టెక్నీషియన్లు, చిన్నా చితకా నటీనటులు, కొందరు నిర్మాతలు కూడా పవన్ కళ్యాణ్ చెప్పిన దాంట్లో తప్పేముంది.? అంటూ తమ వాయిస్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు.
మరోపక్క, ‘పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు మద్దతు పలికితే, పరిశ్రమలో మనుగడ కష్టం..’ అంటూ అప్పుడే బెదిరింపులు కూడా మొదలయ్యాయంటూ ఇంకో వాదన తెరపైకొస్తోంది. సినీ పరిశ్రమను ప్రభుత్వాలు ఆదుకోవాల్సిందే. ఎందుకంటే, పరిశ్రమ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం లభిస్తుంది కాబట్టి. అయితే, ప్రభుత్వాల్ని సవాల్ చేస్తే.. సినిమా షూటింగుల దగ్గర్నుంచి, విడుదల వరకూ అడ్డంకులు ఎదుర్కోక తప్పదు. ఇలాంటి విషయాల్లో సినీ పరిశ్రమ అస్సలేమాత్రం ‘తగాదాల్ని’ కోరుకోదు. ‘అది బానిసత్వం..’ అని కొందరు విమర్శించినా సరే, సర్దుకుపోవడం తప్ప సినీ పరిశ్రమలో ఇంకో ఆప్షన్ లేదు. మరి, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు నిజమేనంటోన్న వారి పరిస్థితేంటి.? కొందరు, సినీ రంగంలో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదంతే ఈ రాజకీయాల కారణంగా.