కొత్త నీతి: రాజకీయాల్లోకి వస్తే, సేవ చెయ్యలేరట.!

రాజకీయం ఏ స్థాయికి దిగజారిపోయిందో చెప్పడానికి ఇదొక నిదర్శనం మాత్రమే. ప్రముఖ గాయకుడు బాబుల్ సుప్రియో, 2014 ఎన్నికల సమయంలో బీజేపీలో చేరారు.. లోక్ సభకు పోటీ చేసి విజయం సాధించారు. కేంద్ర మంత్రి కూడా అయ్యారు. ఆయనే మరోసారి లోక్ సభకు ఎంపికయ్యారు 2019 ఎన్నికల్లో. కానీ, ఇటీవల పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. దాంతో, బీజేపీ అధిష్టానం ఆయన మీద అసహనం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే ఆయన్ను కేంద్ర మంత్రి పదవి నుంచి కూడా తొలగించారు. వరుస పరిణామాలు బాబూల్ సుప్రియోను తీవ్రంగా ఇబ్బంది పెట్టినట్టున్నాయి. రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారాయన. రాజకీయాల్లోకి వచ్చి సేవ చేయాలనుకున్నాననీ, కానీ.. అది వీలు కాలేదనీ, అందుకే రాజకీయాల నుంచి తప్పుకుని, సామాజిక సేవలో నిమగ్నమవ్వాలనుకుంటున్నాననీ బాబూల్ సుప్రియో వెల్లడించారు.

తాను బీజేపీ తప్ప వేరే రాజకీయ పార్టీ గురించిన ఆలోచన చేయలేదనీ, ఏ పార్టీ నుంచీ తనకు ఆహ్వానం అందలేదనీ, ఏ పార్టీలోకీ వెల్లబోననీ బాబూల్ సుప్రీయో స్పష్టం చేశారు. మిగతా విషయాలెలా వున్నా, రాజకీయాల్లోకి వచ్చేదే సేవ కోసమని రాజకీయ నాయకులు చెబుతుంటారు.. అలాంటిది, రాజకీయాల్లోకి వస్తే సేవ చేయడం కుదరని పని.. అని రెండుసార్లు కేంద్ర మంత్రి పదవి చేపట్టిన బాబూల్ సుప్రియో వ్యాఖ్యానించడం విశేషమే మరి. ఔను, రాజకీయ వ్యవస్థ అత్యంత పతన స్థాయికి దిగజారిపోయింది. రాజకీయాల్లోకి వచ్చేది డబ్బు సంపాదించడానికి తప్ప, సేవ చేయడం కోసం కానే కాదు. అధినేత మెప్పు కోసం తప్ప, ప్రజలకు మెరుగైన పాలన అందించడానికి అసలే కాదు.. ఇదీ నేటి రాజకీయం.