గత ఏడాది అల వైకుంఠపురములో చిత్రంతో ప్రేక్షకులని అలరించిన అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమా చేస్తున్నాడు. ఆర్య, ఆర్య2 చిత్రాల తర్వాత బన్నీ-సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. చిత్రంలో బన్నీ పుష్పరాజ్ అనే లారీ డ్రైవర్ పాత్రలో కనిపించనున్నాడు. గత కొద్ది రోజులుగా ఈ చిత్ర షూటింగ్ తూర్పు గోదావరి జిల్లాలలోని రంపచోడవరంలో జరుగుతుంది. అక్కడి ప్రజలు బన్నీ మూవీ సెట్స్ దగ్గరకు తండోపతండాలుగా వస్తుండగా, వారందరిని ఆత్మీయంగా పలకరించారు అల్లు అర్జున్.
ఆగస్ట్ 13న విడుదల కానున్న ఈ సినిమా భిన్నమైన కథాంశంతో తెరకెక్కుతుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతున్న నేపథ్యంలో మూవీ షూటింగ్ మొత్తం ఎక్కవగా అటవీ ప్రాంతాలలో జరుపుతున్నారు. అయితే ఇటీవల మూవీకి సంబంధించిన పలు వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుండడం చిత్ర బృందానికి ఆందోళన కలిగిస్తుంది. ఇటీవల బన్నీ, రష్మికల మధ్య వచ్చే మెలోడీ సాంగ్, మరొకటి పోలీసులకు, అల్లు అర్జున్‌లకు మధ్య జరిగే ఫైట్ సన్నివేశం లీక్ కాగా, ఇవి ఎలా బయటకు వచ్చాయా అని అందరు ఆలోచనలో పడడారు.
పుష్ప లీకేజ్ వ్యవహారం నిర్మాతలకు పెద్ద తలనొప్పిగా మారింది. షూటింగ్ కోసం వచ్చిన జనాల్లో కొందరు చాటుగా ఫొటోలు తీయడం, వీడియోలు షూట్ చేయడం వంటివి చేస్తుండడంతో లీకుల సమస్య ఎదురవుతుంది. దీనిని కంట్రోల్ చేసేందుకు నిర్మాతలు శాయశక్తులా కృషి చేస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని పాన్ ఇండియా మూవీగా రూపొందిస్తుండగా, ఈ సినిమా ఐదు భాషలలో విడుదల కానుంది. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ పోషిస్తాడని ప్రచారం జరుగుతుండగా, ఇందులో ఎంత నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.