టోల్ ప్లాజాలు తీసేస్తారు.. ‘తోలు’ వలిచేస్తారు జాగ్రత్త.!

Toll plazas

Toll plazas

షాకింగ్ న్యూస్.. దేశంలోని జాతీయ రహదార్లపై వున్న టోల్ ప్లాజాలు ఇంకో ఏడాది తర్వాత మాయమైపోవచ్చు. అంటే, టోల్ ప్లాజాల దగ్గర ఆగే అవసరమే లేకుండా దూసుకెళ్ళిపోవచ్చు. ఇంతకీ, టోలు ఫీజు కట్టాలా వద్దా.? మీరు కట్టక్కర్లేదు.. వాళ్ళే లాగేసుకుంటారు. అంతే మరి, రోడ్ల నిర్వహణ అంటే ఆషామాషీ వ్యవహారం కాదు కదా.! నిజానికి, జాతీయ రహదార్లను నిర్మించే క్రమంలో టోల్ ప్లాజాలను ఏర్పాటు చేయడం ద్వారా ‘సర్దుబాట్లు’ జరుగుతుంటాయి.. నిధుల పరంగా. కొన్నేళ్ళపాటు టోల్ ప్లాజాలు నిర్వహించుకునే అవకాశం కాంట్రాక్టర్లకు.. అదేనండీ రోడ్లను నిర్మించిన సంస్థలకు కలుగుతుంది.

ఆ కొన్నేళ్ళ తర్వాత రోడ్లపై టోల్ గేట్లు అస్సలు వుండకూడదు. కానీ, రోజులు మారాయ్. దోచుకున్నోడికి దోచుకున్నంత.. అన్నట్టు తయారైంది పరిస్థితి. అంతర్జాతీయ స్థాయిలో ముడి చమురు ధరలు తగ్గితే, మన దేశంలో పన్నులు పెరుగుతాయి. అదే, అంతర్జాతీయ స్థాయిలో ముడి చమురు ధరలు పెరిగితే, దాంతోపాటే ధరలూ పెరుగుతాయి తప్ప, పన్నులు తగ్గవు. ఇదీ నరేంద్ర మోడీ సర్కార్ తెలివి. ఇంతకు ముందు పరిపాలించిన ఏ ప్రభుత్వానికీ ఇలాంటి చావు తెలివితేటలు లేకుండా పోయాయ్ మరి. ఏం మాట్లాడినా, దేశ భక్తితో ముడిపెట్టేస్తారు.. కానీ, బీజేపీ హయాంలో కేవలం అత్యంత సంపన్నులు మాత్రమే బాగుపడతారు. ఇదేం లెక్క.? సరే, టోల్ ప్లాజాల విషయానికొద్దాం.

టోల్ ప్లాజాలు తీసేసి, జీపీఎస్ టెక్నాలజీ ద్వారా ఏ వాహనం ఏ రోడ్డు మీద ఎంత దూరం ప్రయాణించిందని లెక్కగట్టి, సదరు వాహనదారుడి బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు లాగేస్తారట. మామూలుగా అయితే, టోల్ గేట్ దాటకుండా మధ్యలో ఏదన్నా ఊరికి వెళ్ళాలంటే, టోల్ గేట్‌కి చెల్లించాల్సిన ఫీజు నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇకపై అలా కుదరకపోవచ్చేమో. కిలోమీటరు, అల కిలోమీటరు దూరం జాతీయ రహదారిపైన ప్రయాణించినా వాత పెట్టేస్తారేమో. వావ్.. ఇలాంటి ఐడియాలు అసలెలా వస్తాయో కదా.!