ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియామకమైన సోము వీర్రాజు తొలి రోజే న్యూస్ ఛానెళ్లలో ఆసక్తికర వ్యాఖ్యలతో హైలైట్ అవుతున్నారు. అధ్యక్షుడిగా వచ్చి 24 గంటలు కూడా గడవక ముందే వీర్రాజు మీడియాని చుట్టేస్తున్నారు. ఇప్పటికే గతంలో టీడీపీ-బీజేపీ పొత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. టీడీపీ సంగతేంటో చూస్తానన్నట్లే మాట్లాడారు. తాజాగా ఆయన ముందుకు మూడు రాజధానుల అంశం వెళ్లింది. ఈ నేపథ్యంలో వీర్రాజు ఏమన్నారంటే? కేంద్రంలో, రాష్ర్టంలో ఎక్కడైనా బీజేపీ పాలసీ వికేంద్రీకరణేనని కుండ బద్దలు కొట్టారు. ప్రభుత్వం చెప్పినట్లు మూడు, నాలుగు రాజధానులు కాదు. అన్ని జిల్లాలు రాజధానులగా మారాలి అన్నారు.
అంటే ఆయన ఉద్దేశం ప్రతీ జిల్లా రాజధాని తరహాలో అభివృద్ధిలోకి రావాలని చెప్పారు. అమరావతి ఒక రాజధానిగా ఉండాలని అప్పుడే చెప్పామని గుర్తు చేసారు. అడ్మినిస్ర్టేషన్ సిస్టమ్ సహా రైతులకు పూర్తిగా న్యాయం జరగాలని ఆనాడే చెప్పామన్నారు. అలాగే కర్నూలులో హైకోర్టు పెట్టాలన్నది తమ పార్టీ ఉద్దేశమని వెల్లడించారు. అలాగే పరిపాలనా రాజధానిగా విశాఖ అనుకూలమైనదిగా చెప్పారు. దీంతో కొత్త సారథి మనసులో మాట బయటపడి నట్లు అయింది. మూడు రాజధానుల అంశానికి బీజేపీ పూర్తిగా కట్టుబడి ఉందని…అందులో నో డౌట్ అన్నట్లే వీర్రాజు మాటలను బట్టి క్లారిటీ వచ్చేసింది.
ఇక మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఈ అంశంపై అతి చేసి అడ్డంగా బుక్కై పదవిని కోల్పోయిన సంగతి తెలిసిందే. అదిష్టానం అనుమతి లేకుండా, సమాచారం ఇవ్వకుండా ఎట్టి పరిస్థితుల్లో మూడు రాజధానులు వద్దు..ఒక రాజధాని అది అమరావతి ముద్దు అని టీడీపీ పార్టీ పక్షాన నిలబడటంతో పార్టీ వేటు వేసింది. కేవలం కన్నా ఓవర్ యాక్షన్ కారణంగానే పదవి కోల్పోవాల్సి వచ్చింది అన్నది నిపుణుల మాట. ఏపీలో కన్నా తీసుకుంటోన్న సొంత నిర్ణయాలపై కేంద్రo కొన్ని నెలలుగా కాన్సంట్రేషన్ చేసింది. చివరిగా మూడు రాజధానుల విషయంలో స్వరం పెంచడంతో సీటు మారిపోయింది.