బీజేపీకి ‘ప్రత్యేక హోదా, పవన్ కళ్యాణ్’.. రెండూ ఒకటే.!

Then Special Status, Now Pawan Kalyan

Then Special Status, Now Pawan Kalyan

2014 ఎన్నికలకు ముందు, ఆంధ్రపదేశ్‌కి ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ నినదించింది. ఆ ఎన్నికల్లో బీజేపీ ప్రచారాస్త్రమే అది. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం రాజ్యసభ సాక్షిగా ఐదేళ్ళ ప్రత్యేక హోదాని ఆంధ్రపదేశ్ రాష్ట్రానికి ప్రకటిస్తే, ‘ఐదేళ్ళు సరిపోదు, మేం అధికారంలోకి వచ్చాక పదేళ్ళ పాటు హోదా ఇస్తాం..’ అని ప్రకటించింది బీజేపీ. ఆ తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చాక ఎలాంటి నాటకాలు ఆడిందీ చూశాం. ఆనాటి ఆ ప్రత్యేక హోదా తరహాలోనే, ఇప్పుడు ‘పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి’ అనే కొత్త నినాదాన్ని బీజేపీ భుజానికెత్తుకుంది. బహుశా జనసేనను, బీజేపీలో విలీనం చేసుకునే దిశగా బీజేపీ అధిష్టానం ఈ తరహా స్కెచ్ వేసిందని అనుకోవాలేమో. మొన్న సోము వీర్రాజు, తాజాగా జీవీఎల్ నరసింహారావు.. పవన్ కళ్యాణే బీజేపీ – జనసేన ఉమ్మడి ముఖ్యమంత్రి అభ్యర్థి.. అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. ప్రత్యేకంగా ఈ అంశాన్ని బీజేపీ నిజానికి ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, రాష్ట్రంలో బీజేపీకి వున్న సీన్ చాలా తక్కువ.

బీజేపీతో పోల్చితే జనసేన, రాష్ట్రంలో కాస్త బలంగా వుంది. అయితే, వైసీపీ – టీడీపీలను ఎదుర్కొనేంత సీన్ జనసేనకు లేదు. కేంద్రంలో తమకున్న అధికారాన్ని అడ్డంపెట్టుకుని రాష్ట్రంలో పొలిటికల్ మాయాజాలం చేయాలనుకుంటున్న బీజేపీ, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ భుజాల మీద తుపాకీ పెట్టి రాష్ట్ర రాజకీయాలపై బాంబు పేల్చబోతోందన్నమాట. కేవలం ఇది తిరుపతి ఉఫ ఎన్నికల్లో రాజకీయ లబ్ది కోసం నడుస్తున్న డ్రామాగానే చూస్తే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. అంతకు మించిన పొలిటికల్ స్కెచ్ ఏదో బీజేపీ వేస్తోంది. రాష్ట్రం బాగుపడటాని కోసం బీజేపీ ఎన్ని స్కెచ్చులు వేసినా ఫర్లేదు. కానీ, కులాల కుంపటినని రాజేసేందుకు యత్నిస్తేనే.. మతాల రచ్చకు తెరలేపితేనే.. రాష్ట్రం కలసి కట్టుగా ఆ ప్రయత్నానికి అడ్డుపడాల్సి వుంటుంది. జనసేన కూడా బీజేపీ ఎత్తుగడలపై అప్రమత్తంగా వుండాలి. లేదంటే, అంతే సంగతులు.