రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుతుండటంతో సినిమా హాళ్లు తెరవడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు యాజమానులు. ఒక్కసారి థియేటర్లు ఓపెన్ అయితే వరుసపెట్టి సినిమాలు రిలీజవుతావు. పూర్తైన సినిమాలే కాక ఇంకో వారం పదిరోజుల షూటింగ్ చేస్తే కంప్లీట్ అయ్యే సినిమాలు చాలానే ఉన్నాయి. వాటిలో పెద్ద చిత్రాలు కూడ ఉన్నాయి. అందుకే ఓపెన్ చేయడానికి రెడీగా ఉన్నారు యజమానులు. తెలంగాణ థియేటర్ ఓనర్లు ఈ హడావుడిలో ఉంటే ఆంధ్రాలోని థియేటర్ ఓనర్లు మాత్రం భయం భయంగా ఉంటున్నారు. అందుకు కారణం సీఎం జగన్.
సినిమా హాళ్లు మూతబడకముందు టికెట్ ధరలను భారీగా తగ్గించింది ప్రభుత్వం. కార్పొరేషన్, పంచాయతీ, మున్సిపాలిటీ అంటూ పలు విభాగాల కింద సినిమా హాళ్లను విభజించి టికెట్ ధరలను తగించేశారు. ప్రభుత్వం ఇచ్చిన ఓవర్ నైట్ జీవో ప్రకారం గ్రామ పంచాయతీల్లో ఏపీ థియేటర్లలో టికెట్ రేట్లు రూ.20, 15, 10 గా ఉన్నాయి. నాన్ ఏసీ థియేటర్లలో రూ.15, 10, 5 గా ఉన్నాయి. నగర పంచాయితీల్లో ఏసీ థియేటర్ల హయ్యస్ట్ రేట్ రూ.35కి, మున్సిపాలిటీల్లో హయ్యస్ట్ రేట్ రూ. 70కి మించకూడదని జీవోలో తెలిపారు.
ఈ ధరలతో సినిమా హాళ్లు నడపడం సాధ్యంకాదంటూ లాక్ డౌన్ కంటే ముందే థియేటర్లు మూసుకున్నారు చాలామంది యజమానులు. ‘వకీల్ సాబ్’ విడుదల సమయంలోనే ఈ జీవో వదలడంతో పెద్ద రభసే జరిగింది. గత ఏడాది నుండి ఇప్పటివరకు లాక్ డౌన్ దెబ్బకు బిజినెస్ లేక నష్టపోయిన తాము ఈసారి థియేటర్లు తెరిస్తే తగ్గిన ధరలతో మరింత నష్టపోక తప్పదని, ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని కోరుతున్నారు. మరి వారి వినతిని జగన్ సర్కార్ ఏమేరకు ఆలకిస్తుందో చూడాలి.