Sheikh Mohammed bin Rashid: దుబాయ్ ప్రధానమంత్రి, షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్-మక్తూమ్ ను తన మాజీ భార్య ప్రిన్సెస్ హయా బిన్త్ అల్-హుస్సేన్ కు భరణంగా 554 మిలియన్ పౌండ్లు(రూ. 5540 కోట్లు) ఇవ్వాలని లండన్‌లోని హైకోర్టు ఆదేశించింది. హయా, ఇద్దరు పిల్లల భద్రత ఖర్చు కోసం ముందస్తుగా మూడు నెలల్లోగా 251.5 మిలియన్ పౌండ్లు చెల్లించాలని ఆదేశించారు.
ప్రిన్సెస్ హయా తన బాడీగార్డులలో ఒకరితో అఫైర్ నడుపుతున్న సంగతి భర్తకి తెలియటంతో భయపడి 2019 ఏప్రిల్‌లో బ్రిటన్ కు వెళ్ళిపోయింది. ఆ తర్వాత వారిద్దరూ చట్టపరంగా కోర్టు నుండి విడాకులు పొందినప్పటికీ పిల్లల కస్టడీ విషయంలో ఇన్నాళ్లు కేసు నడుస్తూ వచ్చింది. తనకు,తన పిల్లలకు మొహమ్మద్ బిన్ నుండి రక్షణ లేదని ఆమె కేసు పెట్టారు.
ఈ కేసులో భాగంగా మంగళవారం లండన్ కోర్టులో తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి మాట్లాడుతూ… హయా, డైవర్స్ సెటిల్మెంట్ కోసం డబ్బు అడగడం లేదు. కేవలం వారి భద్రతకు, విడాకుల కారణంగా కోల్పోయిన ఆభరణాలు, దుస్తులు, ఇతర వస్తువుల కోసం ఈ మొత్తం ఇవ్వాలని అన్నారు. అలానే తన పిల్లల విద్యాభ్యాస సమయంలో వారి ఖర్చుల కోసం ఒక్కో సంవత్సరానికి దాదాపు 11 మిలియన్ పౌండ్లను ఇవ్వాలని తీర్పు ఇచ్చారు. అయితే ఇప్పటివరకు లండన్ చరిత్రలో ఇంత డబ్బు భరణంగా ఇవ్వడం ఇదే రికార్డు అని తెలుస్తుంది.