మెగాస్టార్ చిరంజీవికి అదొక్కటే తీరని లోటు.!

మెగాస్టార్ చిరంజీవి.. లక్షలాది మంది, కోట్లాది మంది అభిమానులు ఆయన సొంతం. సినీ రంగంలో చిరంజీవి సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతుల ముందు ‘ముఖ్యమంత్రి’ అనే పదవి చాలా చిన్నదేనేమో.. అంటారు చాలామంది. అది నిజం కూడా. ఐదేళ్ళో, పదేళ్ళో ముఖ్యమంత్రిగా పనిచేస్తే.. అదో గొప్ప విషయమా.? అన్న భావన కొంతమందిలో వుంటే వుండొచ్చుగాక. కానీ, మెగాస్టార్ చిరంజీవి.. ‘మార్పు’ కోసమంటూ రాజకీయాల్లోకి వచ్చి, ప్రజారాజ్యం పార్టీ ద్వారా తనదైన ముద్ర వేయలేకపోయారు. ముఖ్యమంత్రి పీఠమెక్కలేకపోయారు. ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపేసి, ఆ తర్వాత కేంద్ర మంత్రి అయ్యారు. కేంద్ర మంత్రిగా పనిచేసిన సమయంలో చిరంజీవి మీద చిన్న రాజకీయ మరక కూడా అంటుకోకపోవడం గమనార్హం. రాజకీయాల్లో ఎత్తుపల్లాల్ని చిరంజీవి తక్కువ కాలంలోనే అయినా, చాలా ఎక్కువగా చూసేశారు.

బహుశా అందుకేనేమో, మళ్ళీ ఆయన రాజకీయాలవైపు చూడలేదు. కానీ, ‘చిరంజీవి ముఖ్యమంత్రి అయితే బావుణ్ణు..’ అన్న భావన మెగాస్టార్ అభిమానుల్లో ఇప్పటికీ వుంటుంది. అదే ఆయనకి పెద్ద లోటు. దీన్ని ఫెయిల్యూర్.. అని అనగలమా.? అంటే, తప్పదు.. అనాల్సిందే. కానీ, చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ అవ్వాలనుకుంటే, బహుశా ఈసారి ఆయన్ని ముఖ్యమంత్రి పదవి వరించే అవకాశముందేమో. కానీ, చిరంజీవికి ఆ ఆలోచన లేదు. ఎందుకంటే, తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు చిరంజీవి అందరివాడు. దేశవ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు అభిమానులున్నారు. అదే.. మళ్ళీ ఆయన రాజకీయాల్లోకి వస్తే.? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిమితమైపోవాలా.? తెలంగాణ నుంచి ఆయన వ్యతిరేకతను ఎదుర్కొనాల్సి వస్తుందా.? కులం పేరుతో ప్రత్యర్థులు పూసే రాజకీయ మసి తుడుచుకోగలరా.? నాన్సెన్స్.. ఆ చెత్తని భరించడం కంటే, తెలుగు సినీ పరిశ్రమకి పెద్ద దిక్కు.. అనే గౌరవాన్ని నిలబెట్టుకుంటూ… మెగాస్టార్ అందరివాడు.. అనే గౌరవాన్ని పొందుతూ వుండటమే మేలు.