దుబ్బాక ఉపపోరులో కాంగ్రెస్ అదిరిపోయే వ్యూహం

Dubbaka by elections Telugu Rajyam

 తెలంగాణలో ఉప ఎన్నికల సెగ మొదలైంది. దుబ్బాక ఉప పోరును అన్ని పార్టీలు సీరియస్ గా తీసుకున్నాయి. తమ స్థానాన్ని ఎలాగైనా తిరిగి కైవసం చేసుకోవాలని తెరాస, తాము గెలవకపోయిన గట్టి పోటీఇచ్చి రాష్ట్రంలో తామే తెరాస కి సరైన ప్రత్యర్థి అని నిరూపించుకోవడానికి బీజేపీ, తమకి వారసత్వంగా వస్తున్నా పట్టును మరోసారి నిరూపించుకొని తిరిగి ఫామ్ లోకి రావాలని కాంగ్రెస్ పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి..

Dubbaka by elections Telugu Rajyam

 ముఖ్యంగా కాంగ్రెస్ దుబ్బాక ఉప ఎన్నికలకు పెద్ద ఎత్తున సిద్ధం అవుతుంది. తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి మాణికం ఠాగూర్ ప్రత్యేకమైన శ్రద్ద తీసుకోని ఎన్నికలకు పార్టీ నేతలను కార్యకర్తలను సిద్ధం చేస్తున్నాడు. నియోజకవర్గం పరిధిలోని 7 మండలాలకు పార్టీ అనుబంధ, సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసింది. జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి నాయకులతో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ.. స్థానిక నాయకత్వానికి దిశా నిర్దేశం చేస్తున్నారు. దీనికి తోడు రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం మొత్తం ఈ ఎన్నికల కోసం రంగంలోకి దిగుతుంది. నియోజకవర్గంలో 146 గ్రామాలకు గాను ప్రతి రెండు గ్రామాలకు ఒక రాష్ట్రస్థాయి సీనియర్‌ నాయకుడికి బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు. మొత్తం ఏడు మండలాలుండగా ప్రతి మండలానికి మాజీమంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే స్థాయి నేతను ఇన్‌ఛార్జిగా నియమించాలని ఠాగూర్ ఆదేశించారు. వీరందరినీ సమన్వయపరుస్తూ.. పార్టీ ప్రణాళిక సమర్థంగా అమలు పరిచేలా పర్యవేక్షించేందుకు మరో కమిటీని ఏర్పాటు చేయాలని ఠాగూర్‌ బావిస్తున్నారు. కాంగ్రెస్ చేస్తున్న స్థాయిలో మారే పార్టీ కూడా ఈ విధంగా ముందుకి సాగటం లేదు. ఒక రకంగా చెప్పాలంటే దుబ్బాక ఉప పోరులో కాంగ్రెస్ కి జీవన మరణం లాంటిది.

 ఇందులో విజయం సాధిస్తే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కి జవసత్వాలు పెరిగే అవకాశం వుంది. ఓడిపోతే మాత్రం ఆ పార్టీ పరిస్థితి ఇంకా తీసికట్టుగా తయారవుతుంది. మరోపక్క బీజేపీ తామే తెరాస కి సరైన పోటీదారులమని నిరూపించుకోవటానికి సిద్ధంగా వుంది. అందుకే దుబ్బాక ఉప ఎన్నికల పోరులో కాంగ్రెస్ పార్టీ తమ సర్వ శక్తులు ఒడ్డి పోరాటం చేయటానికి సిద్దమైనట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో అధికార పార్టీ వైఫల్యాలే ప్రధాన ప్రచారాస్త్రాలుగా ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. బలమైన అభ్యర్థి కోసం అన్వేషిస్తున్న కాంగ్రెస్ అధికార పార్టీకి చెక్ పెట్టాలని భావిస్తోంది. ఇప్పటికే ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. అక్టోబరు మొదటి వారంలో అభ్యర్థిని ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.