టాలీవుడ్లో మంచి సంగీత దర్శకులు చాలామందే ఉన్నా ఎక్కువగా వినిపించేది మాత్రం రెండు పేర్లే.. అవే దేవిశ్రీప్రసాద్, తమన్. ఏ పెద్ద ప్రాజెక్ట్ సెట్ అయినా వీరిద్దరిలో ఎవరో ఒకరి చేతికి వెళుతుంది. అంతలా పాపులర్ అయ్యారు వీరు. రాజమౌళి మినహా మిగతా పెద్ద దర్శకులందరి ఛాయిస్ ఈ ఇద్దరే. అంతలా పాపులారిటీ తెచ్చుకున్నారు. ప్రేక్షకులకు కూడ వీరి సంగీతం బాగా ఎక్కుతుండటం కూడ వీరికి బాగా కలిసొస్తోంది. ఇంత క్రేజ్ ఉన్న వీరికి తెలుగులో అయితే పోటీగా వచ్చే మూడవ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అయితే లేడనే అనాలి. కానీ తమిళం నుండి మాత్రం ఒకరు పోటీకి దిగుతున్నారు.
అతనే అనిరుద్ రవిచంద్రన్. కోలీవుడ్లో అనిరుద్ ఫాలోయింగ్, క్రేజ్ వేరే లెవల్. తెలుగు ప్రేక్షకులకు కూడ ఆయన సంగీతం సూపరిచితమే. ఇదివరకే తెలుగులోకి సాలిడ్ ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేశాడు అనిరుద్. పవన్, త్రివిక్రమ్ ‘అజ్ఞాతవాసి’ చిత్రంతో మొదటి ప్రయత్నం చేశాడు. అందులో పాటలు బాగున్నా సినిమా ఫ్లాప్ కావడంతో అనిరుద్ ప్రయత్నాలు ఫలించలేదు. అందుకే అప్పటి నుండి ఇప్పటి వరకు తెలుగులో మరో సినిమా చేయలేదు అతడు. అయితే ఇప్పుడు ఆయనకి ఎన్టీఆర్, కొరటాల శివ సినిమాకు సంగీతం అందించే ఛాన్స్ దొరికింది. ఈ సినిమా గనుక హిట్ అయితే తమన్, దేవిశ్రీలకి పోటీ తప్పదు.