ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా రామతీర్థం ఆలయంపై దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ దుమారం రేగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రామతీర్థం పర్యటనకు సిద్ధమవడంతో.., ఆయన కంటే ముందే అక్కడికి వెళ్లేందుకు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి సిద్ధమయ్యారు.
మరోవైపు నాలుగు రోజులుగా బీజేపీ నేతలు రామతీర్థం వద్ద ఆందోళన నిర్వహిస్తున్నారు. ఓ వైపు వైసీపీ, మరోవైపు టీడీపీ, ఇంకో వైపు బీజేపీ కార్యకర్తలు, నేతలు భారీగా చేరుకోవడంతో రామతీర్థంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో రామతీర్థం పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు అరెస్టులు చేస్తున్నారు.
బీజేపీ ఎమ్మెల్యే మాధవ్ కూడా రామతీర్థం పర్యటనకు సిద్ధమవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రామతీర్థం ఘటనపై వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి చేసిన ఆరోపణలపై స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆలయాన్ని పరిశీలించేందుకు సిద్ధమయ్యారు. దీంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీగా అక్కడికి చేరుకుంటున్నారు. చంద్రబాబు పర్యటనకు బయలుదేరే ముందే విజయసాయి రెడ్డి కూడా రామతీర్థం వెళ్లేందుకు రెడీ అయ్యారు. దీంతో అధికార పార్టీ కార్యకర్తలు కూడా రామతీర్థం బాట పట్టారు.