తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీపై కాస్తోకూస్తో ఎదురుదాడికి దిగేది అంటే కాంగ్రెస్ కు చెందిన కొందరు నేతలు మాత్రమే. వాళ్లలో రేవంత్ రెడ్డి ముందుంటే.. ఆ తర్వాత లిస్టులో భట్టి విక్రమార్క కూడా ఉంటారు. ఆయనకు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉంది. కాంగ్రెస్ హయాంలో ఎన్నో ఉన్నత పదవులను చేపట్టి భట్టి.. అసెంబ్లీలో సవాల్ విసిరారు.
నిజానికి భట్టి.. ప్రస్తుతం అసెంబ్లీలో ప్రతిపక్షనేతగా ఉన్నారు. దీంతో అసెంబ్లీలో కాస్త ఘాటుగానే ప్రతి విషయంపై స్పందిస్తున్నారు. ఈనేపథ్యంలోనే హైదరాబాద్ లో లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించామంటూ టీఆర్ఎస్ పార్టీ గొప్పలు చెప్పుకుంటోందని.. దమ్ముంటే హైదరాబాద్ లో లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్లను ఎక్కడ నిర్మించారో తనకు చూపించాలంటూ భట్టి సవాల్ విసిరారు.
ఆ సవాల్ ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వీకరించారు. స్వీకరించడమే కాదు.. గురువారం ఉదయమే అనూహ్యంగా మంత్రి తలసాని.. భట్టి ఇంటికి వెళ్లి.. లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్లను చూపించడం కోసం తమతో రావాలని కోరారు. దీంతో ఖంగుతిన్న భట్టి… తలసానితో కలిసి ఆయన కారులోనే డబుల్ బెడ్ రూం ఇళ్లను పరిశీలించడానికి వెళ్లారు.
వీళ్ల వెంట హైదరాబాద్ మేయర్ రామ్మోహన్ కూడా ఉన్నారు. వీళ్లంతా కలిసి ముందుగా జియాగూడలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూం ఇళ్లను పరిశీలించారు. ఆ తర్వాత పలుచోట్ల డబుల్ బెడ్ రూం ఇళ్లను పరిశీలించారు.
అసెంబ్లీ వాయిదా పడే సమయానికి ముందే.. భట్టి, తలసాని, కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి మధ్య చర్చ జరిగిన సంగతి తెలిసిందే. భట్టి.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులపై ఫైర్ అవుతూ.. టీఆర్ఎస్ పార్టీ అన్నీ అబద్ధాలు చెబుతూ తెలంగాణను మోసం చేస్తోందంటూ కౌంటర్ ఇచ్చారు.
ఈనేపథ్యంలో కాంగ్రెస్ సభ్యులు, టీఆర్ఎస్ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నది. ఆ తర్వాత మీ ఇంటికి వచ్చి మరీ.. మిమ్మల్ని తీసుకెళ్లి మరీ లక్ష డబుల్ బెడ్ రూంలను చూపిస్తామంటూ తలసాని భట్టికి హామీ ఇవ్వడంతో టైం చెబితే ఇంటికి వస్తా… ఎక్కడ నిర్మించారో చూపించండి.. అంటూ భట్టీ సవాల్ విసిరారు.