తెలంగాణలో ప్రస్తుతం ఎన్నికల వాతావరణం నెలకొన్నది. వరుసగా ఎన్నికలు రావడంతో అధికార టీఆర్ఎస్ పార్టీతో పాటు.. కాంగ్రెస్, బీజేపీలు మాంచి జోరుమీదున్నాయి. ఈసారి ఎలాగైనా గెలిచి తెలంగాణలో తమ పార్టీ ప్రతిష్ఠను కాపాడుకోవాలని అన్ని పార్టీలు తెగ ప్రయత్నిస్తున్నాయి.
అయితే.. అధికార పార్టీతో పోటీ పడి గెలవాలంటే కొంచెం కష్టమే. కానీ.. అధికార పార్టీ చేస్తున్న తప్పులను పట్టుకొని ప్రజల్లోకి వెళితే.. టీఆర్ఎస్ కు వ్యతిరేకత వచ్చి తమ పార్టీవైపు ప్రజలు మళ్లుతారనే ఆశతో కొన్ని పార్టీలు పావులు కదుపుతున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కూడా అదే ఉద్దేశంతో ముందుకు కదులుతోంది. గ్రేటర్ ఎన్నికల్లో కాకపోయినా కనీసం ఎమ్మెల్సీ ఎన్నికల్లో అయినా గెలవాలంటూ ఖచ్చితంగా ఎల్ఆర్ఎస్ అంశాన్నే ప్రధానంగా తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఫిక్స్ అయిందట.
ఎందుకంటే.. ప్రస్తుతం తెలంగాణలో ఎల్ఆర్ఎస్ పై చాలా విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే రిజిస్ట్రేషన్ కోసం వేలకు వేలు ఖర్చుపెడితే.. మళ్లీ ఈ ఎల్ఆర్ఎస్ కట్టడం ఏంటి? ఎల్ఆర్ఎస్ కు మళ్లీ వేలు తగలేయాలా? అంటూ జనాలు కాసింత అసంతృప్తికి లోనవుతున్నారు. దాన్ని క్యాష్ చేసుకొని టీఆర్ఎస్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మాండమైన అస్త్రం దొరికినట్టయింది.
అందుకే.. కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంటనే అత్యుత్సాహంతో.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. ప్రజలందరికీ తమ ప్లాట్లకు ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేస్తామని.. ఎవ్వరూ ఎల్ఆర్ఎస్ కట్టొద్దు అంటూ పిలుపునిచ్చింది.
ఎల్ఆర్ఎస్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం.. తెలంగాణ ప్రజల నుంచి సుమారు 3 లక్షల కోట్ల రూపాయలను దోచుకుంటోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే దీనిపై హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు అయింది. కేసు కూడా నడుస్తోంది. దీన్నే తమవైపునకు తిప్పుకొని కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో ప్రచారం చేయనుందట. చూద్దాం మరి.. ఈ అస్త్రమైనా కాంగ్రెస్ పార్టీకి వర్కవుట్ అవుతుందో? లేదో?