వైఎస్ జగన్ అవినీతిపరుడని చంద్రబాబు, టీడీపీ ఆరోపణలు చేస్తే చంద్రబాబు, లోకేష్ చేసిన అవినీతికి లెక్కే లేదని వైఎస్ జగన్, వైసీపీ నేతలు ఆరోపిస్తూ ఉంటారు. ఇప్పటికే జగన్, విజయసాయిరెడ్డిలు జైలుకు వెళ్లడాన్ని తెలుగుదేశం వర్గం పదే పదే గుర్తుచేస్తూ ఎద్దేవా చేస్తూ ఉంటారు. ఇక విజయసాయి సహా వైసీపీ నేతలందరూ ఇప్పటికే అచ్చెన్నాయుడు, జేసీలు అరెస్ట్ అవడాన్ని చూపి నెక్స్ట్ చంద్రబాబు, లోకేష్ వంతని భవిష్యవాణి వినిపిస్తుంటారు. నిత్యం ఇదే తరహా విమర్శలు, ప్రతివిమర్శలతో టీడీపీ, వైసీపీలు పోట్లాడుకుంటుండటాన్ని చూస్తున్న జనం ఇంతలా ఆరోపణలు చేసుకుంటున్నారు, ఒకరినొకరు భయపెట్టుకుంటున్నారు.. మరి నిజంగా ఎవరు అవినీతికి పాల్పడ్డారు, ఎవరు ముందు జైలుకు వెళతారు అంటూ స్వీయ ప్రశ్నలు వేసుకుంటున్నారు.
ఇదిలా ఉండగా విజయసాయిరెడ్డి తాజాగా చంద్రబాబును ఉద్దేశించి ఒక ట్వీట్ వేశారు. అందులో ‘పార్టీ వ్యవహారాలను కొడుకుకు అప్పగించాలని బాబు గారు అనుకుంటున్నారా? వయసు పెరగడం, జ్ఞాపకశక్తి క్షీణించడంతో కుమారుడికి పగ్గాలు ఇస్తారంట. కరోనా ఉధృతి తగ్గగానే లోకేశ్ నాయుడును ‘కాబోయే సీఎం’గా ఎలివేట్ చేసేలా సైకిల్ యాత్ర చేయించాలని ఎల్లో మీడియా ముఖ్యులు రూట్ మ్యాప్ ఇచ్చారంట’ అంటూ వ్యాఖ్యానించారు. దీంతో మరోసారి ఎవరు అరెస్టవుతారనే వాదనలు మొదలయ్యాయి.
విజయసాయి ట్వీట్టర్ వ్యాఖ్యలను చూపించి వైసీపీ వర్గీయులంతా పార్టీని కొడుక్కి అప్పగిస్తున్నారు అంటే బాబుగారు త్వరలో జైలుకి వెళ్లబోతున్నారన్నమాట. ఆయనలో అరెస్ట భయం మొదలైంది అంటూ ఎద్దేవా చేస్తుండగా టీడీపీ మద్దతుదారులు ఎంటరై బాబు సంగతి తర్వాత ఆల్రెడీ జగన్, విజయసాయిలు ఒక్కసారి జైలుకెళ్లారు. మళ్లీ వెళతారేమో. ఆలోపు మీ పార్టీ నుండి నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరనేది డిసైడ్ అవ్వండి అంటూ కౌంటర్లు వేస్తున్నారు.