Pawan Kalyan: ఏపీలో సీఎం చంద్రబాబు తనయుడు, ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలంటూ పార్టీ నేత రాజేష్ మహాసేన మొదలుపెట్టిన డిమాండ్ ను ఆ తరువాత ఇతర నేతలు కొనసాగిస్తూ గత కొద్దిరోజులుగా సంచలనం సృష్టించారు. ఇలా పవన్ కళ్యాణ్ ని కాకుండా నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలి అంటూ వస్తున్నటువంటి డిమాండ్ పై జనసైనికులు మండిపడ్డారు.
ఇదిలా ఉండగా నారా లోకేష్ డిప్యూటీ సీఎం కావాలి అంటూ వస్తున్నటువంటి వార్తలపై టీడీపీ హై కమాండ్ పూర్తిస్థాయిలో సీరియస్ అవుతూ ఇంకొకసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు అంటూ తన కేడర్ ను మందలించారని తెలుస్తోంది. ఇలా తెలుగుదేశం పార్టీ ఎత్తుగడలను విఫలం చేయటంలో పవన్ సక్సెస్ అయ్యారని చెప్పాలి.
సాధారణంగా తెలుగుదేశం పార్టీకి ఒక ఆనవాయితీ ఉంది వారు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు తమ నేతలు, తన మీడియా ఛానల్ పత్రికల ద్వారా ఆ వార్తను ప్రజలలోకి తీసుకువెళ్తారు. ప్రజల నుంచి ఆ విషయానికి ఏ విధమైనటువంటి స్పందన వస్తుంది అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ వీరి ఆలోచనలకు వ్యతిరేకత వస్తే ఆ ఆలోచనను అక్కడితో విరమిస్తారు. అలాకాకుండా అనుకూలత వస్తే మాత్రం అదే ఆలోచనను ఆచరణలో పెడతారు.
ఈ క్రమంలోనే నారా లోకేష్ డిప్యూటీ సీఎం కావాలనే డిమాండ్ కూడా ఈ తరహా ప్రయత్నమే అని చెప్పాలి అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఈ ఆలోచనను పూర్తిస్థాయిలో తిప్పి కొట్టారు. తన పార్టీ ఇంచార్జ్ అయినటువంటి కిరణ్ రాయల్ చేత సరికొత్త వివాదాన్ని తెరపైకి తీసుకువచ్చారు. లోకేష్ డిప్యూటీ సీఎం అయితే చూడాలని తెలుగుదేశం కేడర్, కార్యకర్తలు ఏ విధంగా అయితే కోరుకుంటున్నారో పవన్ సీఎం కావాలని పదేళ్లుగా మేము ఎదురు చూస్తున్నాము అంటూ మాట్లాడారు.
ఈ విధంగా నారా లోకేష్ కి కనుక డిప్యూటీ సీఎం పదవి ఇస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కు సీఎం పదవి ఇవ్వాల్సిందేనని భావించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ విషయంలో వెనక్కి తగ్గి ఇకపై ఎవరూ కూడా ఈ విషయం గురించి మాట్లాడకూడదు అంటూ హుకుం జారీ చేసినట్టు తెలుస్తుంది. ఇక ఈ విషయం తెలియని మంత్రి భరత్ ఏకంగా దావోస్ పర్యటనలో భాగంగా మాట్లాడటంతో చంద్రబాబు కూడా సీరియస్ అయ్యారని తెలుస్తోంది.