ఆ హీరోలు వేస్ట్ అంటున్న తమ్మారెడ్డి భరద్వాజ

ప్రముఖ సినీ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మరో సారి తన గళం విప్పారు. తరచూ సినీ ఇండస్ట్రీ లో ఉన్న ఇబ్బందుల మీద స్పందించే తమ్మారెడ్డి తాజాగా టాలీవుడ్ హీరోల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న ‘తెలుగు భాషా దినోత్సవం’ సందర్భంగా ఆయన టాలీవుడ్ లో కొందరి హీరోలను టార్గెట్ చేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేసారు.

ఇప్పుడు అందరూ పాన్ ఇండియా మోజులో పడి తెలుగును మర్చిపోతున్నారని ఆయన విమర్శించారు. తెలుగు సినిమాలలో తెలుగు పరిస్థితి ఎలా ఉందో చూస్తే మనం ఎంత దిగజారిపోయామో అర్థం అవుతుందని తమ్మారెడ్డి భరద్వాజ చెప్పుకొచ్చారు. పాన్ ఇండియా అప్పట్లోనే ఉండేదని ఇప్పుడు మనవాళ్లు కొత్తగా కనిపెట్టింది ఏమి లేదని ఆయన అన్నారు.తెలుగు వాళ్లు ఎక్కువగా ఇంగ్లీష్ పేర్లను పెడుతున్నారని ఆయన కామెంట్లు చేశారు.చిరంజీవి, బాలకృష్ణలను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.

అన్ని భాషలలో సినిమాలు తీస్తున్నామని చెప్పి తెలుగులో ఏవేవో పదాలు పెట్టడం కరెక్ట్ కాదని తమ్మారెడ్డి అన్నారు.

చాలామంది మ్యూజిక్ డైరెక్టర్లకు తెలుగు రాకపోవడం వల్ల ఆ సింగర్స్ ఏమి పాడుతున్నారో వాళ్లకు అర్థం కావడం లేదని తమ్మారెడ్డి భరద్వాజ చెప్పుకొచ్చారు.ఆశ్చర్యం ఏమిటంటే తెలుగు వచ్చిన గాయకులు సైతం తెలుగు రాని గాయకులను అనుకరిస్తున్నారని తమ్మారెడ్డి భరద్వాజ పేర్కొన్నారు.

ఇప్పుడు తెలుగు సినిమా ఎక్కడుందని తెలుగు భాషకు పరభాషా పదాలు తగిలిస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు.అలాంటి డైలాగ్స్ రాసేవాళ్లకు బుద్ధి లేదని ఆయన కామెంట్ చేశారు.ప్రస్తుతం యాక్టర్లకు తెలుగు రాదని సెట్స్ లో ఎక్కువమందికి తెలుగు రాదని ఆయన అన్నారు.

ఒక సింగర్ కల్లుకు, కళ్లుకు డిఫరెన్స్ తెలియకుండా పాట పాడారని ఆయన చెప్పుకొచ్చారు.చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే ప్రమోషన్స్ లో కూడా తెలుగులో మాట్లాడుతున్నారని తమ్మారెడ్డి కామెంట్లు చేశారు.పరభాషా నటులైన ప్రకాష్ రాజ్, సిద్దార్థ్ తెలుగు నేర్చుకుని మాట్లాడుతుంటే మనవాళ్లు తెలుగు మరిచిపోతున్నారని తమ్మారెడ్డి చెప్పుకొచ్చారు.

ఒకప్పుడు అవమానకరంగా ఉన్న కొన్ని పదాలు ఇప్పుడు వాడుక పదాలు అయ్యాయని తమ్మారెడ్డి కామెంట్లు చేశారు.