ఇది నిజంగా ఓ విచిత్ర సంఘటన. ముఖ్యమంత్రికి చల్లగా ఉన్న చపాతీలు వడ్డించారని ఓ ఫుడ్ సేఫ్టీ అధికారినే సస్పెండ్ చేశారు. విడ్డూరంగా ఉంది కదా.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసా?
మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఈ విచిత్ర ఘటన చోటు చేసుకున్నది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇండోర్ పర్యటనకు ఇటీవల వెళ్లారు. పర్యటన అనంతరం.. ముఖ్యమంత్రికి, ఆయనతో పాటు వచ్చిన అధికారులు, మంత్రులకు భోజన ఏర్పాటు చేశారు అధికారులు.
ఎక్కడైనా ముఖ్యమంత్రి పర్యటిస్తే.. అక్కడ భోజన ఏర్పాట్లన్నీ చూసుకోవాల్సింది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్. అలాగే.. అక్కడ కూడా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ముఖ్యమంత్రికి కావాల్సిన ఫుడ్ ను అరేంజ్ చేశాడు. ఆయనకు చపాతీలు వడ్డించాడు. అయితే అవి చల్లగా ఉన్నాయి. అయినప్పటికీ.. ముఖ్యమంత్రి వాటిని తినేశారు. మిగితా వాళ్లకు కూడా అవే చపాతీలను వడ్డించారు.
అయితే.. ముఖ్యమంత్రికి చల్లటి చపాతీలు వడ్డించడం ఉన్నతాధికారులకు తెలిసి.. వెంటనే ఆ ఫుడ్ సేఫ్టీ అధికారిని విధుల నుంచి సస్పెండ్ చేశారు. చల్లగా ఉన్న చపాతీలు ముఖ్యమంత్రికి ఎలా వడ్డిస్తారంటూ.. ఆయనపై మండిపడ్డారు.
సీన్ కట్ చేస్తే… ఈ విషయం ముఖ్యమంత్రి వద్దకు వెళ్లింది. చపాతీలు తిన్నది నేను. నాకే సమస్య లేనప్పుడు అతడిని ఎందకు సస్పెండ్ చేసినట్టు. అందరితో పాటు నేను కూడా. అందరు తిన్నవే తిన్నాను కదా. నేను ఆ విషయాన్ని అస్సలు పట్టించుకోను. ఇందులో ఆ అధికారి తప్పేం లేదు. వెంటనే అతడిని విధుల్లోకి తీసుకోండి.. అంటూ ఆ జిల్లా కలెక్టర్ కు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయడంతో కథ క్లైమాక్స్ చేరుకుంది.