Sangam Dairy: టీడీపీ నేత ధూళిపాళ్ళ నరేంద్ర, సంగం డెయిరీలో అక్రమాలకు పాల్పడ్డారంటూ ఇటీవల ఏసీబీ ఆయన్ని అరెస్ట్ చేసిన విషయం విదితమే. ప్రస్తుతం సంగం డెయిరీ ఛైర్మన్ పదవిలో వున్నారాయన. అయితే, ధూళిపాళ్ళ అరెస్ట్ తర్వాత సంగం డెయిరీకి సంబంధించి ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తొలుత సంగం డెయిరీని, గుంటూరు పాల ఉత్పత్తిదారుల సహకార సంఘానికి బదిలీ చేస్తూ జీవో విడుదల చేసిన ప్రభుత్వం, ఆ వెంటనే దాన్ని ఉపసంహరించుకుని, ఏపీ డెవలప్మెంట్ కార్పొరేషన్ పరిధిలోకి తీసుకొస్తూ కొత్తగా ఉత్తర్వులు జారీ చేసింది.
సంగం డెయిరీ రోజువారీ కార్యకలాపాల్ని ఇకపై తెనాలి సబ్ కలెక్టర్ పర్యవేక్షిస్తారు. ఈ విషయంలో ఎలాంటి ఆటంకాలైనా ఎవరైనా కల్పిస్తే, వారిపై చర్యలు తీసుకునే అధికారం కూడా సబ్ కలెక్టర్ కి అప్పగించడం జరిగింది. రాష్ట్ర రాజకీయాల్లో ఇదొక కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. అమూల్ సంస్థకు కట్టబెట్టేందుకే సంగం డెయిరీకి సంబంధించి అధికార పార్టీ కుట్ర పూరిత చర్యలకు దిగిందనీ, అధికారాన్ని అడ్డం పెట్టుకుని తప్పుడు ఆరోపణల్ని సంగం డెయిరీ మీదా తన మీదా చేస్తున్నారనీ ధూళిపాళ్ళ ఆరోపిస్తోన్న విషయం విదితమే.
ఇంతలోనే, సంగం డెయిరీని ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ పరిధిలోకి.. అంటే ప్రభుత్వ పరిధిలోకి తీసుకెళ్ళడం అత్యంత ఆసక్తికరమైన పరిణామం. ప్రభుత్వ చర్యలతో ఒక్కసారిగా డెయిరీ రంగ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ప్రభుత్వ పరిధిలోకి తొలుత తీసుకొచ్చి, దాన్ని ఆ తర్వాత అమూల్ డెయిరీకి అప్పగిస్తారా.? అన్నదానిపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో, సంగం డెయిరీ పూర్తిగా ధూళిపాళ నరేంద్ర చేజారిపోయినట్లే చెప్పుకోవచ్చేమో. మరి, ఆ సంస్థ మీద ఆధారపడి రాజకీయం చేస్తోన్న ధూళిపాళ్ళ నరేంద్ర రాజకీయ భవిష్యత్తు ఏమవుతుందో ఏమో మరి.!