Sudheerbabu: బావతో విలన్ గా చేస్తా…. మనసులో ఉన్న మాటను బయటపెట్టిన సుధీర్ బాబు!

Sudheerbabu: సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరో సుధీర్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రేమ కథ చిత్రం ద్వారా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న సుధీర్ బాబుకి ఇండస్ట్రీలో తిరుగులేదని భావించారు.అయితే ఈయన ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు దశాబ్ద కాలం పూర్తయినప్పటికీ ఏ విధమైనటువంటి బ్రేక్ రాలేదని చెప్పాలి. ఈ విధంగా ఇండస్ట్రీలో మంచి విజయం కోసం ఎదురుచూస్తున్న సుధీర్ బాబు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ ఇంటర్వ్యూలో భాగంగా సుధీర్ బాబు మాట్లాడుతూ తాను కృష్ణ మహేష్ బాబులను ప్రేరణగా తీసుకుని ఇండస్ట్రీలోకి వచ్చానని నేను ఏ సినిమా కథ విన్న ఆ సినిమా గురించి వారితో చర్చించి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. అదేవిధంగా తనకు తన బావ మహేష్ బాబుతో విలన్ గా నటించాలని ఆశ ఉందని తన మనసులోని కోరికను బయటపెట్టారు. మహేష్ బాబుకు సరిపడే కథ దొరికితే అందులో విలన్ పాత్ర నాకు అనుగుణంగా ఉంటే తప్పకుండా బావతో పోటీ పడతానని ఆయన సినిమాలో విలన్ గా నటించడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలియజేశారు.

ఈ విధంగా మహేష్ బాబు సినిమాలో విలన్ గా నటించే అవకాశం వస్తే ఏ మాత్రం వదులుకోనని తెలియజేశారు. తన కొడుకులు కూడ ఇండస్ట్రీలోకి వస్తారని, ఇప్పటికే ఒక అబ్బాయి మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట చిత్రంలో మహేష్ బాబు చిన్నప్పటి పాత్రలో నటిస్తున్నారని తెలియజేశారు. ఇక నా సినిమాను ఏ విధంగా ప్రమోట్ చేయాలో కూడా వారు తెలుపుతారనీ సుధీర్ బాబు తెలిపారు. కెరీర్‌ పరంగా ఎలాంటి అసంతృప్తి లేదని, కాకపోతే పెద్ద హిట్‌ పడలేదనే బాధ ఉన్నట్టు చెప్పారు.