ఓటు కోసం షూటింగ్ క్యాన్సిల్ చేసుకున్న స్టార్స్.. 300కి.మీ దూరం నుండి వ‌చ్చిన న‌టులు ఎవ‌రో తెలుసా?

గ్రేట‌ర్‌లో ఎన్నిక‌ల హంగామా నెల‌కొంది. ఈ రోజు పోలింగ్ డే కావ‌డంతో సామాన్యులు, సినీ ప్ర‌ముఖులు, రాజ‌కీయ నాయకులు పోలింగ్ బూత్‌కు వెళ్లి త‌మ ఓట్ హ‌క్కును వినియోగించుకుంటున్నారు. ఇప్ప‌టికే చిరంజీవి, సురేఖ‌, నాగార్జున, అమ‌ల‌, మంచు ల‌క్ష్మీ, ద‌ర్శ‌కుడు క్రిష్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి ఫ్యామిలీ, ర‌చ‌యిత ప‌ర‌చూరి గోపాల కృష్ణ‌, శ్యామ్‌ప్ర‌సాద్ రెడ్డి త‌దిత‌రులు కొద్ది సేప‌టి క్రితం ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. కేపీహెచ్‌ ఏడో ఫేజ్‌లోని పోలింగ్ బూత్ నంబర్ 58లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేసిన రాజేంద్ర ప్ర‌సాద్ ప్ర‌తి ఒక్క‌రు ఓటు హ‌క్కు వినియోగించుకోవాల‌ని కోరారు.

మ‌న భవిష్యత్తునే నిర్దేశించే ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకోవడం అంద‌రి బాధ్య‌త అని చెప్పిన రాజేంద్ర‌ప్ర‌సాద్ తాను అర‌కులో షూటింగ్‌లో ఉన్న‌ప్ప‌టికీ అది క్యాన్సిల్ చేసుకొని ఓటు వేసేందుకు హైద‌రాబాద్‌కు వ‌చ్చాన‌ని అన్నారు. పోలింగ్ మంద‌కొడిగా సాగుతుండ‌డం నన్ను ఆశ్చ‌ర్యప‌రుస్తుంది. అంద‌రు ఇందులో భాగ‌స్వాములు కావాల‌ని ఆయన కోరారు. ఇక గ్రేటర్ ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి నటుడు, నిర్మాత, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీ రాజా 300 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చారు.

శివాజీ రాజా కొద్ది రోజులుగా ఓ సినిమా షూటింగ్ కోసం గుంటూర్‌లో ఉన్నారు. ఈ రోజు ఎల‌క్ష‌న్స్ అని అది ఆపేసి హైద‌రాబాద్‌కు వ‌చ్చిన‌ట్టు శివాజీ రాజా పేర్కొన్నారు. లోక్‌స‌భ్, అసెంబ్లీ ఎన్నిక‌లు ఎంత ముఖ్య‌మో మున్సిప‌ల్ ఎన్నిక‌లు కూడా అంతే ముఖ్య‌మ‌నే విష‌యాన్ని ఓట‌ర్లు గుర్తించాలి. అంద‌రు విధిగా ఓటు వేయాల‌ని శివాజీ రాజా పేర్కొన్నారు. కాగా, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ మందకొడిగా కొనసాగుతోంది. మొదటి రెండు గంటల్లో కేవలం 3.10 శాతం మాత్రమే పోలింగ్ నమోదు కాగా, ప్ర‌స్తుతం ప‌ది శాతానికి చేరుకుంది. ఓట వేస్తేనే అభ్య‌ర్ధిని ప్ర‌శ్నించే హ‌క్కు మ‌న‌కు ఉంటుంద‌ని చెబుతున్నారు