సాధారణంగా ప్రెస్ మీట్ కానీ.. మీడియా సమావేశం కానీ ఎక్కడ ఏర్పాటు చేస్తారు? ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు.. ఎవరైనా సరే వాళ్ల ఆఫీసుల్లో ఏర్పాటు చేస్తారు. లేదా ఏదైనా హాల్ తీసుకొని అక్కడ ఏర్పాటు చేస్తారు. కానీ.. ఈ మంత్రి ఏంటండి.. కొబ్బరి చెట్టు ఎక్కి ప్రెస్ మీట్ పెట్టాడు. పదండి ఆయన కథాకామీషు ఏంటో తెలుసుకుందాం.
ఆయన పేరు అరుండికా ఫెర్నాండో. మనోడు కాదు లేండి. శ్రీలంక మంత్రి. శ్రీలంకలోని డాంకోటువాలో ఉన్న తన కొబ్బరి తోటలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. దీంతో మీడియా మిత్రులంతా అక్కడికి చేరుకొని మంత్రి చేసిన పనికి షాక్ అయ్యారు. వాళ్లు అక్కడికి వెళ్లి చూసేసరికి.. ఆయన కొబ్బరి చెట్టు ఎక్కి ఉన్నారు. ఒక చేతిలో కొబ్బరి బోండాం పట్టుకొని ఉన్నారు.
అయితే.. ఆయన కొబ్బరి చెట్టు ఎక్కేందుకు ఉపయోగించే అధునాతన యంత్రాన్ని ఉపయోగించి కొబ్బరి చెట్టు ఎక్కారు. ఇక తన ప్రసంగాన్ని ప్రారంభించారు.
కొబ్బరి ఉత్పత్తులకు విపరీతంగా డిమాండ్ పెరిగింది.. కొబ్బరి కాయల ధరలు కూడా పెరిగాయి. కొబ్బరి ఉత్పత్తులకు సంబంధించిన ఉద్యోగాల కొరత ఎక్కువగా ఉంది.. అందులోనూ కొబ్బరి చెట్ల కొరత కూడా ఎక్కువగా ఉంది. కొబ్బరికి సంబంధించి ప్రజల డిమాండ్ ను ప్రభుత్వానికి గట్టిగా వినిపించడం కోసమే నేను కొబ్బరి చెట్టు ఎక్కా. కొబ్బరి డిమాండ్ ను తీర్చాలంటే.. ప్రభుత్వం ఖాళీ స్థలాల్లో కొబ్బరి చెట్లను పెంచాలి. అలాగే కొబ్బరి ఉత్పత్తుల మీద ఆధారపడి జీవిస్తున్న వారికి ఉపాధి కల్పించాలి… అంటూ చెప్పి తన ప్రసంగాన్ని ముగించి కొబ్బరి బోండాలను కొట్టి కిందికి దిగారు మంత్రి.
అంతే.. అక్కడికొచ్చిన మీడియా మిత్రులంతా చప్పట్లతో ఆయన్ను ప్రశంసించారు. నిజానికి శ్రీలంకలో ఎక్కువ మంది కొబ్బరి వ్యాపారమే చేస్తుంటారు. కొబ్బరి వ్యాపారంలో ఉన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఆ మంత్రి అటువంటి నిర్ణయం తీసుకోవడంతో.. శ్రీలంకలో ఎక్కడ చూసినా ఆ మంత్రి టాపికే చర్చనీయాంశమైంది.