అభిమానులని అబ్బురపరుస్తున్న నిహారిక వెడ్డింగ్‌ కార్డ్

Niharika Wedding Special

ఈ కరోనా కాలం సినిమా ఇండస్ట్రీలో పెళ్లిళ్ల సీజన్ గా మారిపోయింది. ఇప్పటికే పలువురు స్టార్స్ పెళ్లి చేసుకొని , వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టగా , అతి త్వరలో కొణిదెల వారింట పెళ్లి బజాలు మోగడానికి సర్వం సన్నద్ధమవుతుంది.

నాగబాబు గారాల పట్టి నిహారిక కొణిదెల పెళ్లికి అన్నీ హంగులు పూర్తికావస్తున్నాయి. గుంటూరు ఐజీ జె.ప్రభాకర్ రావు తనయుడు జొన్నలగడ్డ వెంకట చైతన్యతో నిహారిక పెళ్లి డిసెంబర్ 9న రాత్రి 7 గంటల 15 నిమిషాలకు మిథుల లగ్నంలో జరగనుంది. తాజాగా నిహారిక పెళ్ళికి సంబంధించిన శుభలేఖను మెగా ఫ్యామిలీ విడుదల చేసింది.

ఈ పెళ్లి వేడుకని రాజస్థాన్ ‌లోని ఉదయ్‌పూర్ ‌లో మెగా కుటుంబ అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అన్ని సిద్ధం చేసింది. ఈ డెస్టినేషన్ వెడ్డింగ్‌ కి మెగా కుటుంబ సభ్యులందరూ కలిసి వెళ్లనున్నారు. డిసెంబర్ 11న హైదరాబాద్‌లోని జె.ఆర్.సి. కన్వెన్షన్ సెంటర్‌లో వివాహ రిసెప్షన్‌ను ఇవ్వనున్నారని తెలుస్తుంది. డిసెంబర్ 9న జరగబోయే పెళ్లి పనులను నిహారిక, ఆమె అన్నయ్య హీరో వరుణ్ తేజ్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

ఇకపోతే , నిహారిక ముద్దపప్పు అవకాయ్, నాన్నకూచి, మ్యాడ్ హౌస్ వంటి వెబ్ సిరీస్‌లలో నటించడమే కాదు.. పింక్ ఎలిఫెంట్ బ్యానర్‌పై ఈ వెబ్ సిరీస్‌లను నిర్మించారు కూడా. ఆ తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టారు. ఆమె నాగశౌర్యతో కలిసి ఒక మనసు, రాహుల్ విజయ్‌తో సూర్యకాంతం, విజయ్ సేతుపతి, గౌతమ్ కార్తీక్‌తో కలిసి ఒరు నెల్ల నాల్ పాత్తు సొల్రన్ వంటి సినిమాల్లో నటించారు. చిరంజీవి టైటిల్ పాత్ర పోషించిన సైరా నరసింహారెడ్డిలోనూ నిహారిక ఓ చిన్న పాత్రలో నటించారు.