స్పేస్ టూరిజం: అంతరిక్షాన్ని కూడా నాశనం చేసేస్తారా.?

Space Tourism

Space Tourism

వర్జిన్ గెలాక్టిక్ అనే సంస్థ ద్వారా రోదసీ యానం జరిగింది. మన తెలుగు మహిళ శిరీష బండ్ల, ఈ సంస్థ చేపట్టిన ప్రయోగం ద్వారా అంతరిక్షంలోకి వెళ్ళివచ్చారు. నిజానికి, అంతరిక్ష పరిశోధన కోసం మాత్రమే ఉద్దేశించింది కాదు. ఇదొక స్పేస్ టూరిజం ప్రాజెక్ట్.

వీకెండ్ ఫన్ కోసం పబ్బులకి వెళ్ళినట్లు.. విదేశాలకు వెళ్ళి వచ్చినట్లు.. ఓ గంటన్నర అలా అంతరిక్షంలోకి వెళ్ళి వచ్చేయడమే. మొత్తం ఆరుగురు వ్యక్తులు నిన్నటి రోదసీ యానంలో పాల్గొన్నారు. ప్రయోగం విజయవంతంగా జరిగింది. అంతరిక్షంలో వుండేది చాలా చాలా తక్కువ సమయం. మిగతాదంతా ప్రయాణ సమయమే.

ఇక, ఈ ప్రాజెక్టు కోసం పెద్దయెత్తున డొనేషన్లు ఇవ్వాలంటూ పిలుపునిచ్చింది వర్జిన్ గెలాక్టిక్ సంస్థ. ఇక్కడే పెద్ద చిక్కు వచ్చి పడింది. అసలు స్పేస్ టూరిజం తాలూకు అవసరమేంటి.? అన్న చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రగతి.. అంటూ భూమిని సర్వనాశనం చేసుకున్నామనీ, ఓ చిన్న వైరస్.. కోవిడ్ 19 ప్రపంచాన్ని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్ళు తాగించేస్తోందనీ, దానికే పరిష్కారం కనుగొనలేకపోతున్న మనం, అంతరిక్షాన్ని కూడా నాశనం చేసేందుకే ఈ యాత్రలు, ప్రయోగాలుచేస్తున్నామా.? అన్న ప్రశ్న తెరపైకొచ్చింది. వందలాది మంది, వేలాది మంది ఇదే ప్రశ్నని సంధిస్తున్నారు.

అయితే, వర్జిన్ గెలాక్టిక్ సంస్థ చేపట్టిన ప్రయోగాన్ని తప్పు పట్టలేం. అంతరిక్షంలోకి వ్యోమ నౌకల్ని తేలికగా పంపించడానికి ఇదొక అద్భుతమైన మార్గం. కానీ, దీన్ని స్పేస్ టూరిజం కోసం వినియోగించడంపైనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. స్పేస్ ఎక్స్ సహా పలు సంస్థలు స్పేస్ టూరిజం దిశగా ఈ నెలలోనే ప్రయోగాలు చేయనున్న సంగతి తెలిసిందే.