గాన గంధర్వుడు, ప్రసిద్ద సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇక లేరు. కరోనాతో గతకొంత కాలంగా ఆయన చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం 1.04 గంటలకు తుదిశ్వాస విడిచారు. బాలు అస్తమయంతో సంగీత ప్రియులు శోకసంద్రంలో మునిగిపోయారు. మళ్లీ వస్తాను, మీ కోసం పాడతాను అంటూ ఆసుపత్రి బెడ్ మీద నుంచి మాటిచ్చిన ఆయన తిరిగిరాని లోకాలకు పయనమవడంతో కోట్లాది మంది అభిమానులు డిగ్బ్రాంతికి గురయ్యారు.
ఆగష్టు 5నుండి ఆసుపత్రిలోనే ఉన్న బాలుగారి ఆరోగ్యం గురించి ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే వచ్చారు. ఒకానొక దశలో ఆయన కోలుకుంటున్నారని, ఎలాంటి భయం లేదని, లిక్విడ్స్ తీసుకుంటున్నారని, ఫిజియోథెరపీ కూడ చేస్తున్నారని అన్నారు. దీంతో అభిమానులు ఇక ఎలాంటి భయం లేదనుకుంటుండగా ఉన్నట్టుండి నిన్న ఆరోగ్యం క్షీణించడంతో వైద్యులు లైఫ్ సపోర్ట్ సిస్టంతో చికిత్స అందించినా లాభం లేకపోయింది.
ఈరోజు మధ్యహ్నం 1:04 గంటలకు ఆయన కన్నుమూసినట్టు కుమారుడు ఎస్పీ చరణ్ ప్రకటించారు. ఇకపోతే ఈ రోజు సాయంత్రం 4 గంటలకు బాలు పార్థివదేహాన్ని ఎంజీఎం ఆసుపత్రి నుండి కోడంబాకంలోని ఎస్పీ చరణ్ ఇంటికి తరలిస్తారు. రేపు మధ్యాహ్నం వరకు అభిమానుల సందర్శనార్థం ఉంచి రేపు సాయంత్రం తిరువళ్లూరు జిల్లాలో రెడ్ హిల్స్ సమీపంలోని తామరైపాకంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.