AP: జనసేన నాయకుడు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పశ్చిమ గోదావరి జిల్లాలో జనసైనికుల కుటుంబాలకు బీమా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈయన కూటమి ప్రభుత్వం గురించి అలాగే కూటమి పార్టీలు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. పౌరసరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న నాదెండ్ల మనోహర్ త్వరలోనే కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయబోతున్నట్లు ప్రకటించారు.
ఇక కూటమి పార్టీలో ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ఒకటి. ఈ పథకం గురించి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఈ పథకాన్ని ఎంతో విజయవంతంగా అమలు చేశామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం కింద దాదాపు 90 లక్షల మందికి ఉచిత గ్యాస్ సిలిండర్ దీపం- 2 పథకం ద్వారా అందించామని అన్నారు. గత ప్రభుత్వ సమయంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని మంత్రి నాదెండ్ల ఆరోపించారు.
రానున్న రోజుల్లో తెల్ల రేషన్ కార్డులను మంజూరు చేసి అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి ఇంటి స్థలాలతో పాటు ఇంటి నిర్మాణాలను కూడా చేపడతామని మంత్రి మనోహర్ తెలియచేశారు.ఇతర సూపర్ సిక్స్ పథకాలు చిత్తశుద్ధితో అమలు చేయనున్నాం. ఒకేసారి వేయి రూపాయల పెన్షన్ పెంచి అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేస్తున్నమని తెలిపారు. ఒకటో తేదీనే కాకుండా ఒకరోజు ముందుగానే రాష్ట్ర వ్యాప్తంగా పింఛని పంపిణీ కార్యక్రమం జరుగుతోందని తెలిపారు.
రైతులకు పంట డబ్బు 48 గంటల్లో అకౌంట్లో వేశామని తెలిపారు. ఇక సూపర్ సిక్స్ హామీలలో ఒకటైనటువంటి తల్లికి వందనం పథకం గురించి కూడా మంత్రి మనోహర్ మాట్లాడారు అతి త్వరలోనే తల్లికి వందనం పథకాన్ని కూడా అమలు చేయబోతున్నట్లు ఈయన తెలియజేశారు. తల్లికి వందనం పథకంలో భాగంగా ఇంట్లో ఎంతమంది చదువుతుంటే వారందరికీ కూడా 15000 రూపాయలు చొప్పున తల్లుల ఖాతాలో జమ చేయనున్నట్లు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. అయితే విద్యా సంవత్సరం పూర్తి కావస్తున్నా ఇంకా తల్లికి వందనం పథకం అమలు చేయకపోవడంతో విమర్శలు వస్తున్న నేపథ్యంలో మంత్రి ఈ పథకం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
