లాక్ డౌన్ నేపథ్యంలో బాలీవుడ్ నటుడు సోనుసూద్ వలస కూలీలను సొంత డబ్బు ఖర్చు పెట్టి బస్సులు వేసి స్వస్థలాలకు తరలించిన సంగతి తెలిసిందే. దీంతో సోనుసూద్ పేరు దేశ వ్యాప్తంగా మారు మ్రోగిపోయింది. ఓ నటుడిగా కన్నా గొప్ప సేవా దృక్ఫధం గలవాడిగా సోనుసూద్ ని , ఆయన సేవల్ని అంతా కొనియాడారు. రాజకీయ పార్టీలో ఎంట్రీకి ఇదే సరైన సమయం అంటూ వ్యాఖ్యానించాయి. ఈ నేపథ్యంలో శివసనే ఎంపీ సంజయ్ రౌత్ తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దీనికి రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేసారు. అధికారంలో ఉన్న బీజేపీ డబ్బులిస్తే సొనుసూద్ చేసాడంటూ ఆరోపించారు.
ఆర్ధిక ప్రయోజనాల కోసం సోనూ చేసిన పని ఇది. ఆయన భాజాపా కొమ్ము కాస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. దీంతో ఈ ఎంపీ వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా నెటి జనులంతా చీవాట్లు పెట్టడం జరిగింది. సేవా దృక్ఫధంతో చేస్తే రాజకీయం అంటగడతావా? అంటూ చెడుగుడు ఆడుకున్నారు. తాజాగా ఎంపీ గారీ వ్యాఖ్యలపై సోనూ కూడా కౌంటర్ వేసారు. నా వెనుక దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలున్నాయి. ఒక్క బీజేపీనే కాదు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ ఉన్న అన్ని పార్టీలు నావే…నా వెంటే ఉన్నాయి. అందరూ నాకు మద్దతిస్తున్నారు. నేను వాళ్లకి మద్దతిస్తున్నాను. ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా? అంటూ మారు మాట్లాడకుండా చేసారు.
కష్టాల్లో ఉన్న ప్రతీ ఒక్కరికి సాయం చేసేందుకు ప్రయత్నిస్తానన్నారు. వలస కార్మికులతో సోనూ ప్రయాణం చాలా ప్రత్యేకమైనదిగా చెప్పుకొచ్చారు. సాయం కోసం ఎవరు సంప్రదించినా వారి ఇంటికి చేర్చుందుకు అన్ని ఏర్పాట్లు చేయడంలో ఎప్పుడూ మందుంటానన్నారు. ఇది రాజకీయం అనుకున్నా పర్వాలేదు…ఇంకేమనుకున్నా పర్వా లేదంటూ సదరు ఎంపీకి కౌంటర్ వేసారు సోను సూద్. మరి శివసేన ఎంపీ వీటికి ఏమని బధులిస్తారో? చూడాలి.