గ్లామర్‌ మీద సోము వీర్రాజుగారికి అంత మోజెందుకో ?

Somu Veeraju love towards movie stars 

సినీ తారల్ని చూస్తే జనం ఎగబడతారనేది అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా వాస్తవమే.  కానీ వాళ్ళని చూసి ఓట్లేస్తారనేది మాత్రం అవాస్తవం.  ఒకప్పుడైతే హీరో హీరోయిన్లు, ఇతర నటీనటులు ఎన్నికల్లో నిలబడితే ఓట్లు రాలేవి.  కానీ ఇప్పుడా పరిస్థితి లేదు.  నిజానికి దేశంలో సినీ గ్లామర్‌కు రాజకీయాలకు గట్టి బంధం ఉన్నది దక్షిణాది రాష్ట్రాల్లోనే.  తమిళనాడు, ఆంధ్రాలో ఎవరైనా స్టార్ హీరో అయ్యారంటే ఆయన తర్వాతి మజిలీ రాజకీయాలే అన్నట్టు ఉండేది.  జనం కూడ స్టార్ హీరోలను రాజకీయాల్లోకి రావాలని ఒత్తిడి చేసేవారు.  అలా ఒత్తిడి చేసి తీసుకొచ్చి  ఓట్లేసి గెలిపించేవారు.  అలా సినీ రంగం నుండి రాజకీయాల్లోకి అడుగుపెట్టి  ముఖ్యమంత్రులు అయినవారు ఉన్నారు.  ఎంజీఆర్, ఎన్టీఆర్, జయలలిత లాంటి వారు సినిమాల నుండి రాజకీయాల్లోకి వచ్చినవారే.  ఇంకొందరు నటీనటీలు కూడ రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యారు.  

రాజకీయ పార్టీలు సైతం సినిమా తారలను పార్టీలోకి చేర్చుకోవాలని తెగ ఉవ్విళ్ళూరేవి.  పార్టీలోకి వస్తే టికెట్ ఇచ్చేసేవి.  వారినే స్టార్ క్యాంపైనర్లుగా చేసుకుని భారీ మీటింగ్లు, ర్యాలీలు చేసేవారు.  జనం కూడ స్టార్లు వస్తున్నారంటే తండోపతండాలుగా సభలకు హాజరై ఎన్నికల్లో ఓట్లు గుద్దేసేవారు.  అయితే ఈ కాలంలో మాత్రం కేవలం తారలను చూడటానికి వస్తున్నారు తప్ప ఓట్లు వేయట్లేదు.  అందుకు నిదర్శనమే చిరంజీవి, పవన్ కళ్యాణ్.  అశేషమైన అభిమానగణం ఉన్న ఈ ఇద్దరూ వారినే నమ్ముకుని రాజకీయాల్లోకి వచ్చి దెబ్బతిన్నారు.  జనం ఇచ్చిన షాక్ తో చిరు రాజకీయా సన్యాసం తీసుకుంటే పవన్ ఏదో కిందా మీదా పడుతున్నారు.  వీరిద్దరితోనే తెలుగు రాజకీయాల్లో సినీ గ్లామర్ శకం ముగిసిందని రూఢీ అయింది.  అందుకే అప్పటి నుండి రాజకీయ పార్టీలు సైతం సినిమా తారల వెంటపడటం తగ్గించాయి.  

Somu Veeraju love towards movie stars 
Somu Veeraju love towards movie stars

కానీ భారతీయ జనత పార్టీ మాత్రం సినీ తారల మీద విపరీతమైన మోజు పెంచుకుంటోంది.  తమిళనాడు, ఆంధ్రాలో పార్టీకి సినీ గ్లామర్ తళుకులు అద్దాలని తహతహలాడుతోంది.  తమిళనాట సూపర్ స్టార్ రజినీని తమవైపుకు తిప్పుకోవాలని చూస్తూ ఏపీలో సినీతారలకు గాలాలు వేస్తోంది.  కొత్త అధ్యక్షుడు సోము వీర్రాజుగారికైతే స్టార్ల మీద గంపెడు ఆశలు, బోలెడు నమ్మకం ఉన్నట్టు కనబడుతోంది.   ఇప్పటికే హీరో కమ్ పొలిటీషియన్ పవన్ ను పక్కపెట్టుకున్న ఆ పార్టీ చిరంజీవి కోసం ట్రై చేస్తోంది.  పార్టీలోకి రావాలని, మద్దతు ఇవ్వాలని కోరుతోంది.  చిరు లాంటి స్టార్ పార్టీలో ఉంటే జనం తండోపతండాలుగా తమ సమావేశాలకు వస్తారనేది ఆయన ఆశ కాబోలు.  ఇప్పటికే చిరుతో పలుమార్లు మంతనాలు జరిపిన ఆయన తాజాగా రాజేంద్రప్రసాద్ తో భేటీ అయినట్టు వార్తలొస్తున్నాయి.  

ఈ ప్రయత్నాలన్నీ ఆయన ఏదో ఊరికే ఊసుపోక చెయ్యట్లేదు.  వీలుంటే వారిని పార్టీలోకి తీసుకోవాలనేది ఆయన మదిలోని ఆలోచన.  పెద్ద స్టార్లే కాదు చిన్నా తరహా స్టార్ల కోసం కూడ ట్రై చేస్తున్నారట.  అయితే సినీ గ్లామర్ మీద బండి నడిచే రోజులు పోయాయి.  వారిని చూడటానికి ఎగబడి జనం ఓట్లు ఖచ్చితంగా వేయరు.  అలాంటప్పుడు సోము వీర్రాజుగారు సినీ పరిశ్రమ వెనక పడుతుండటం ఏదో ఆర్భాటం కోసమే అవుతుంది తప్ప బలపడటానికి, గెలవడానికి అనిపించుకోదు.