రాజకీయాల్లో పొత్తుల గురించి ఏ పార్టీ మాట్లాడినా అది హాస్యాస్పదమే. తెరవెనుక కనిపించని పొత్తులు, తెర ముందు కనిపించే పొత్తులు.. ఇలా చాలా వ్యవహారాలుంటాయి. అంతేనా, స్థానికంగా కూడా అప్పటికప్పుడు అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల్లోనూ అభ్యర్థుల కోణంలో అవగాహనలు నడుస్తాయి. ఇప్పుడిదంతా ఎందుకంటే, వామపక్షాలపై భారతీయ జనతా పార్టీ నిప్పులు చెరిగేసింది.. పొత్తుల విషయమై. సీపీఐ నేత రామకృష్ణ, బీజేపీ మీద విమర్శలు చేసేసరికి, బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు విరుచుకుపడిపోయారు.
అన్ని రాజకీయ పార్టీలతోనూ పొత్తులు పెట్టకున్న సీపీఐ ఎన్నికల కమిషన్ గుర్తింపు కూడా కోల్పోయిందని ఎద్దేవా చేశారు సోము వీర్రాజు. ఈ వ్యాఖ్యలు పరోక్షంగా పవన్ కళ్యాణ్ పార్టీ జనసేననూ ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి నెట్టేసింది. జనసేన, గతంలో బీజేపీకి మద్దతిచ్చింది.. ఆ తర్వాత బీజేపీపై విరుచుకుపడింది. టీడీపీతోనూ అంతే. వామపక్షాలతోనూ కలిసి పనిచేసింది జనసేన. బహుజన్ సమాజ్ పార్టీ వైపుకు కూడా వెళ్ళింది. ఇప్పుడు మళ్ళీ బీజేపీతో కలిసి నడుస్తోంది. నిజానికి, రాజకీయాలంటేనే అంకెల గారడీగా మారిపోయినప్పుడు పొత్తులు తప్పవు. బీజేపీ కూడా గతంలో టీడీపీతో జతకట్టింది, ఆ తర్వాత ఆ పార్టీతో విభేదించింది.. మళ్ళీ టీడీపీతోనే జతకట్టింది 2014 ఎన్నికల్లో. ఇప్పుడు మళ్ళీ టీడీపీతో బీజేపీ వైరం కొనసాగిస్తోంది.
కాలక్రమంలో చాలా పార్టీలతో బీజేపీ పొత్తు పెట్టకుంది, పెట్టుకుంటూనే వుంది. భవిష్యత్తులోనూ బీజేపీ పొత్తుల ప్రసహనం నడుస్తుంది. రాజకీయాల్లో విమర్శలు సహజమేగానీ.. మరీ ఇంతలానా.? గురివింద నైజాన వ్యవహరిస్తే ఎలా.? వామపక్షాలంటే ఫక్తు రాజకీయ పార్టీలు కావు. వివిధ రాజకీయ పార్టీలతో పొత్తులు పెట్టుకున్నా ప్రజల కోసం పోరాడే పార్టీలవి. అంతే తప్ప, రొటీన్ రాజకీయ పార్టీల్లా దిగజారుడు రాజకీయాలు చేయవు.