కోనసీమ వివాదంపై వైసీపీని బీజేపీ కూడా ప్రశ్నించేస్తోందహో.!

భారతీయ జనతా పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పీఠమెక్కేయాలన్న ఆశతో వుంది. ఆ ఆశ వుండడం తప్పు కాదుగానీ, ఆ పార్టీకి ఏపీలో వున్న ఓటు బ్యాంకు ఎంత.? రాష్ట్రానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న సాయమెంత.? అనేవి కూడా లెక్కల్లోకి తీసుకోవాలి కదా.?

కోనసీమ జిల్లాకి అంబేద్కర్ పేరు పెట్టాలన్న ఆలోచనని తప్పు పట్టలేంగానీ, ఇంత వివాదానికి కారణమైన ప్రభుత్వ అనాలోచిత విధానాన్ని ప్రశ్నిస్తున్నామంటూ బీజేపీ నేతలు మీడియా ముందుకొచ్చి నానా హంగామా చేసేశారు. అంబేద్కర్ పేరుని సంక్షేమ పథకాలకు పెట్టొచ్చుగా.. అన్నది బీజేపీ సూటి ప్రశ్న.

నిజమే, సంక్షేమ పథకాల కోసం ఖర్చు చేసే వేల కోట్లు, లక్షల కోట్లు.. ప్రజలకు సంబంధించిన సొమ్ములే. వాటికి అధికారంలో వున్నవాళ్ళు సొంత పేర్లు పెట్టుకోవడం క్షమార్హం కానే కాదు. కానీ, ఏం చేస్తాం.? వ్యవస్థలు అలా తగలబడ్డాయ్.!

కోవిడ్ వ్యాక్సిన్ విషయంలో, ప్రధాని నరేంద్ర మోడీ చేసిందేంటి.? ప్రధాని వ్యాక్సిన్ పథకం.. అని అనలేదుగానీ, కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ల మీద తన ఫొటో వేయించుకున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. రాజకీయాల్లో వ్యక్తి పూజ చాలా చాలా ఎక్కువైపోయింది.

పెద్దన్న లాంటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు మార్గదర్శకంగా వుండాలి. జనం సొమ్ముతో ఎలాగైతే నరేంద్ర మోడీ సొంత పబ్లిసిటీ చేసుకుంటున్నారో.. అలాగే రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు కూడా.! వాళ్ళూ, వాళ్ళూ.. అందరూ చేసేది అదే.! మతం ప్రాతిపదికన రాజకీయాలు చేసే బీజేపీ, కులం పేరుతో కోనసీమలో రాజకీయాలు నడుస్తుండడాన్ని ప్రశ్నించడం ఇంకా ఇంకా హాస్యాస్పదం.