NV Ramana: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన ఎన్వీ రమణ విషయమై తెలుగు నాట, ప్రత్యేకంగా కొన్ని మీడియా సంస్థలు వ్యవహరిస్తున్న తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. సీజేఐ ఎన్వీ రమణ మన తెలుగువారు కావడం, తెలుగువారందరికీ గర్వకారణం. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. అయితే, ఆయన విషయంలో మీడియా ప్రదర్శిస్తున్న అత్యుత్సాహం, అదే సమయంలో టీడీపీ మద్దతుదారులైన కొందరు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా చేస్తోన్న కామెంట్లు.. అందర్నీ విస్మయానికి గురిచేస్తోన్నాయి.
ముఖ్యమంత్రి వైఎష్ జగన్ మోహన్ రెడ్డి, జస్టిస్ ఎన్వీ రమణ మీద పలు ఆరోపణలు చేస్తూ, అప్పటి సీజేఐ బాబ్డేకి లేఖ రాసిన మాట వాస్తవం. జగన్ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని సుప్రీంకోర్టు అంతర్గతంగా ఏర్పాటు చేసిన కమిటీ తేల్చింది. ఎన్వీ రమణకు క్లీన్ చిట్ ఇస్తూ, ఆయన్ని సీజేఐ పోస్టుకి సిఫార్సు చేశారు బాబ్డే. అది గతం. సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన ఎన్వీ రమణకు శుభాకాంక్షలు చెప్పారు వైఎస్ జగన్. అక్కడితో వివాదం ముగిసినట్లేనా.? అన్నది వేరే చర్చ.
కానీ, తనను సీజేఐ కాకుండా జగన్ అడ్డుకున్నారన్న కారణంగా, జగన్ విషయంలో ఎన్వీ రమణ తన సత్తా ఏంటో చూపించక మానరంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ దర్శనమిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే టీడీపీ అనుకూల మీడియా సంస్థల్లో ఎన్వీ రమణ వ్యక్తిత్వాన్ని ఆకాశానికెత్తేస్తూ కథనాల్ని వండి వడ్డిస్తున్నారు. నిజానికి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనే గొప్ప పదవిలో కూర్చున్న వ్యక్తులు, చిన్న చిన్న వివాదాల్ని పట్టించుకునే పరిస్థితి వుండదు.
మీడియాలో వచ్చే కథనాల్ని అస్సలు లెక్క చేయరు. సోషల్ మీడియాలో వ్యాఖ్యల సంగతి చెప్పుకోవడం అనవసరం. కానీ, టీడీపీ మద్దతుదారులు (మీడియా సంస్థలు కావొచ్చు, సోషల్ మీడియాలో సందడి చేస్తున్నవారు కావొచ్చు) చేస్తున్న హంగామా కారణంగా, రేప్పొద్దున్న రాష్ట్రానికి సంబంధించి కీలక అంశాలపై సర్వోన్నత న్యాయస్థానం ఎలాంటి ఆదేశాలిచ్చినా, వాటిని వైసీపీ అనుకూలురు వివాదాస్పదం చేసే అవకాశం లేకపోలేదు.