నిన్న మొన్నటిదాకా ఆయన తెలంగాణ రాష్ట్ర సమితిలో అత్యంత కీలకమైన నేత. అంతేనా, తెలంగాణ ప్రభుత్వంలో కీలకమైన మంత్రి కూడా. కానీ, ఇప్పుడు అన్నీ మారిపోయాయ్. ఆయన మీద భూ కబ్జా నిందలు మోపింది రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యమంత్రి అయితే, తన మంత్రి వర్గం నుంచి ఆయన్ని తొలగించేశారు. ఆయనే ఈటెల రాజేందర్. తాజాగా ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసిన ఈటెల రాజేందర్, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ మీదా, ముఖ్యమంత్రి కేసీఆర్ మీదా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
రాజకీయాల్లో ఇలాంటివన్నీ మామూలే. గతంలో పార్టీ నుంచి వెళ్ళినవారూ ఇలాంటి విమర్శలు చేశారు. వాటిని ఈటెల రాజేందర్ అప్పట్లో ఖండించారు. ఇప్పుడు ఆయనే తెలంగాణ రాష్ట్ర సమితి మీద మండిపడుతున్నారు. ఇది జస్ట్ రాజకీయ సిత్రం.. అంతే. ఇక, ఈటెల రాజేందర్ మీద గులాబీ దండు దాడి షురూ చేసింది. ఈటెల రాజేందర్ అవినీతిపరుడంటూ గులాబీ పార్టీకి చెందిన నేతలు పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు గుస్సా అవుతున్నారు. తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోస్తున్నారు.
ఈటెల ఎంతటి అవినీతిపరుడని తెలిసినా, ఆయన్ని క్షమించేశామన్నది గులాబీ పార్టీ వాదన. అదేంటీ, అవినీతిపరుడ్ని క్షమించడమంటే, ఆ అవినీతిని ప్రోత్సహించడమే కదా.? ఈటెల చేసిన ఆరోపణలకీ ఇది వర్తిస్తుంది. కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తోంటే, ఆ నియంత పాలనలో మంత్రిగా ఎలా పనిచేసినట్లు.? అంటే, నియంత పాలనకి పూర్తిస్థాయిలో అండగా నిలిచి, తెలంగాణ సమాజానికి ఈటెల హాని చేశారని అనుకోవాలేమో.
ఇప్పుడే ఏమైపోయింది.. ముందు ముందు అసలు కథ మొదలు కాబోతోంది. బీజేపీలో చేరి, కమలం కండువా భుజాన వేసుకుంటే.. ఆ తర్వాత ఈటెలలోని అసలు సిసలు ఫైర్ బ్రాండ్ బయటకొస్తుంది. అప్పడిక బూతులే బూతులు.. ఈటెల నుంచీ, గులాబీ నేతల నుంచీ. వినడానికి సిద్ధమైపోండహో.