Election Commission: కేంద్ర ఎన్నికల సంఘం, చేతులు కాలాక ఆకులు పట్టుకోమంటోందా.? ఔననే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల నిర్వహణ.. అంటే, దాని వెనుక చాలా వ్యవహారాలుంటాయి. ఒక్కసారి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక, కీలక విభాగాలన్నీ కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలోనే పనిచేయాల్సి వుంటుంది.
కరోనా భూతం దేశాన్ని విలవిల్లాడిస్తున్న వేళ, కేంద్ర ఎన్నికల సంఘం, ఎన్నికల ప్రచారాలపై ఆంక్షలు విధించాల్సి వుంది. కానీ, నిబంధనల్ని ఉల్లంఘించి, కనీసపాటి బాధ్యత వహించకుండా రాజకీయ పార్టీలు ప్రచార కార్యక్రమాలు నిర్వహించాయి. సాధారణ రోజుల్లో తరహాలోనే పెద్దయెత్తున జనాన్ని సమీకరించాయి రాజకీయ పార్టీలు. కార్యకర్తలు, పెయిడ్ ఆర్టిస్టులు తప్పతాగి చిందులేశారు ఎన్నికల ప్రచారంలో. ఫేస్ మాస్కులు ధరించడం.. అన్న విషయాన్నే చాలామంది మర్చిపోయారు. ఫలితం, దేశంలో కరోనా వైరస్ అత్యంత వేగంగా విస్తరించింది.
3 లక్షలకు పైగా రోజువారీ కేసులు, 2 వేలకు పైగా రోజువారీ కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈసీ అధికారులపై హత్యా నేరం మోపితే తప్పేంటి.? అని మద్రాసు హైకోర్టు వ్యాఖ్యానించాల్సి వచ్చింది. దాంతో, కాస్త తీరిగ్గా కళ్ళు తెరిచిన కేంద్ర ఎన్నికల సంఘం, ఎన్నికల ఫలితాల వెల్లడి రోజున విజయోత్సవ ర్యాలీలు వద్దంటూ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ఫలితాల వెల్లడితో కేంద్ర ఎన్నికల సంఘం బాధ్యత పూర్తయిపోతుంది. ఆ తర్వాత ఎటూ వ్యవహారం ఇంకోలా వుంటుంది.
జనం చచ్చిపోతున్నా తమకేమీ పట్టదన్నట్టు రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచార సమయంలోనే వ్యవహరించినప్పుడు, ఎన్నికలయ్యాక ఆగుతారా.? అయినా, ఎన్నికల నిబంధనల్ని ఉల్లంఘించేవారెందరిపై కేంద్ర ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకుంటోంది.? నిబంధనలనేవి వినడానికే బావుంటాయి.. హెచ్చరికలు.. కేవలం మీడియాలో వార్తలకు మాత్రమే పనికొస్తాయి.. అన్నట్టు తయారైంది పరిస్థితి. అంతలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని రాజకీయ పార్టీలు లైట్ తీసుకుంటున్నాయి.