అరరె, గోపీచంద్ ‘ఆరడుగుల బుల్లెట్’ రిలీజైపోతోందే.!


ఎప్పటి సినిమా ఎప్పుడొస్తోందో.. అక్టోబర్ 8 వ తేదీకి ఇంకా ఎన్నో రోజుల్లేదు. సినిమా రిలీజ్ డేట్ వచ్చేసినా, ఆ సినిమాపై ఆ హీరోకి గానీ, ఆ హీరో అభిమానులకు గానీ పెద్దగా ఆసక్తి ఉన్నట్లు కనిపించడం లేదు. ఎందుకంటే, ఆ సినిమా ఎప్పుడో మూలన పడిపోయింది. మళ్లీ ఇప్పుడు బూజు దులుపుతున్నారంతే.

ఆ సినిమా పేరు ‘ఆరడుగుల బుల్లెట్’. ఆ హీరో పేరు గోపీచంద్. నిజానికి మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ అనదగ్గ కాంబినేషన్ ఇది. బి.గోపాల్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. అయితే, కొన్ని కారణాలతో సినిమా విడుదల ఆలస్యమయ్యింది. వాయిదాల మీద వాయిదా పడుతూ వచ్చింది. ఓ సారి రిలీజ్ డేట్ కన్ఫామ్ అయ్యి, సరిగ్గా మార్నింగ్ షో పడే ముందు ఆగిపోయింది.

గోపీచంద్ లాంటి మాస్ హీరో సినిమాకి ఏంటీ కష్టాలు.? అంటూ అతని అభిమానులు చాలా ఫీలైపోయారు. వాస్తవానికి ఓటీటీ వేదికగా ఈ సినిమాని విడుదల చేసేసి ఉంటే, బావుండేదేమో.. అన్న చర్చ నడుస్తోంది. కానీ, ధియేటర్ రిలీజ్ వైపే ‘ఆరడుగుల బుల్లెట్’ మొగ్గు చూపుతున్నాడు. ఇంతకీ ఆ రోజైనా ఈ సినిమా నిజంగా విడుదలవుతుందా.? ఏమో వేచి చూడాల్సిందే.