Covisheild: 250 రూపాయల మేర ఒకేసారి ధర పెంచేసి, అందులోంచి ఓ వంద రూపాయల ధర తగ్గిస్తే.. మొత్తంగా ధర పెరిగినట్లా.? తగ్గినట్లా.? వినేవాడు వెర్రి వెంగళప్ప అయితే, చెప్పేటోడు సిద్ధాంతి.. అని ఊరకనే అన్లేదు పెద్దలు. సీరం ఇనిస్టిట్యూట్, కోవి షీల్డ్ వ్యాక్సిన్ ధరని 100 రూపాయల మేర తగ్గించిందన్న వార్త ‘బ్రేకింగ్’ అయి కూర్చుంది మీడియాలో.
నిజమేనా.? ధర తగ్గిందా.? అంటే, తగ్గలేదు.. నిజానికి పెరిగింది. ఔను, 100 శాతం ధర పెరిగింది. 150 రూపాయల నుంచి 300 రూపాయలకు కోవిషీల్డ్ టీకా ధర పెరిగింది. ఇదీ వాస్తవం. మరి, 100 రూపాయల మేర ధర తగ్గడమేంటి.? అంటే, అదే మరి పబ్లసిటీ జిమ్మిక్కు.. అంటే. కేంద్ర ప్రభుత్వానికి 150 రూపాయలకే ఒక డోసు టీకాను అందిస్తోన్న సీరం సంస్థ, రాష్ట్రాలకు 400 రూపాయల ధర నిర్ణయించిన సంగతి తెల్సిందే. అదే ప్రైవేటు ఆసుపత్రుల్లో టీకా వేయించుకోవాలంటే 600 రూపాయలు చెల్లించాలి.
కేంద్రానికి ఒకలా, రాష్ట్రాలకు ఇంకోలా ధరలేంటి.? అని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తిన వేళ, కేంద్రం.. ధర తగ్గించాల్సిందిగా సీరం సంస్థను కోరాల్సి వచ్చింది. కేంద్రం అలా కోరడంతో, సీరం సంస్థ ఇలా 100 రూపాయలు తగ్గిస్తున్నట్లు ప్రకటించిందన్నమాట. కానీ, ఇందులో ధర తగ్గిందేమీ లేదు. 100 రూపాయలు పెరిగిందంతే. పైగా, సామాన్యుడు.. ప్రైవేటు ఆసుపత్రుల్లో టీకా వేయించుకోవాలంటే మాత్రం 600 రూపాయలు.. చెల్లించాల్సిందే.
సీరం సంస్థ పబ్లిసిటీ స్టంట్లు ఇలా వుంటే, భారత్ బయోటెక్ ఇంకెలాంటి మ్యాజిక్కులు చేయబోతోందో. నిజానికి, భారత్ బయోటెక్ అందిస్తోన్న కోవాగ్జిన్‌తో పోల్చితే, సీరం వ్యాక్సిన్ ధర తక్కువే. కోవాగ్జిన్, రాష్ట్రాలకు ఇచ్చే వ్యాక్సిన్ ధరని 600 రూపాయలుగా నిర్ణయించింది. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఈ వ్యాక్సిన్ ధర 1200 రూపాయలు. దోపిడీకి ఇంతకన్నా గొప్ప మార్గం ఇంకేముంటుంది.?