ఆంధ్రా మీద కరోనా పగబట్టినట్టే ఉంది ప్రస్తుత పరిస్థితి. క్రమేణా కేసుల సంఖ్య పెరుగుతూ కొత్త రికార్డులు క్రియేట్ అవుతున్నాయి. తక్కువ రోజుల్లోనే అత్యధిక కేసులు నమోదవుతున్న రాష్ట్రాల జాబితాలోకి ఏపీ చేరిపోయింది. చూస్తుండగానే రోజుకి 10,000 కేసులు నమోదయ్యే ప్రమాదకర స్థాయికి చేరుకున్నాం మనం. నిన్న 10,093 పాజిటివ్ కేసులు రాగా గడిచిన 24 గంటల్లో 10,167 కేసులు బయటపడ్డాయి. ఇప్పటి వరకు కరోనా కారణంగా 1,281 మంది మరణించారు. ఇలా వరుసగా రెండు రోజులు 10,000లకు పైగా పాజిటివ్ కేసులు రావడంతో పరిస్థితి కంట్రోల్ చేయలేని స్థితికి చేరుకుందేమో అని ఆందోళనపడుతున్నారు ప్రజలు. వైద్యులు సైతం ఈ స్థాయిలో కేసుల పెరుగుదల ప్రమాదకరమనే అంటున్నారు.
ప్రభుత్వం మాత్రం ఎక్కువ సంఖ్యలో టెస్టులు చేస్తుండటం వలనే అధిక సంఖ్యలో కేసులు బయటపడుతున్నాయని అంటున్నారు. నిజమే ప్రభుత్వం పెద్ద సంఖ్యలో పరీక్షలు నిర్వహిస్తోంది. గడిచిన రెండు రోజుల్లో రోజుకు 70,000లకు పైగానే పరీక్షలు నిర్వహించారు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో జరుగుతున్న పరీక్షల కంటే ఇది ఎక్కువే. ఈ విషయంలో మాత్రం సర్కార్ పనితీరును మెచ్చుకుని తీరాల్సిందే. కానీ వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో, కొవిడ్ బాదితులకు వైద్య సౌకర్యాలు కల్పించడంలో మాత్రం ప్రభుత్వం పనితనం అంత గొప్పగా ఉన్నట్టు కనిపించడం లేదు. పరీక్షలైతే చేస్తున్నారు కానీ అదుపు చేయడంలో మాత్రం వెనకబడుతున్నారు.
అసలే ప్రజలు సామాజిక దూరం లాంటి నియమాలను సక్రమంగా పాటించలేకపోతున్నారు. ఇలాంటి తరుణంలో వైన్ షాపుల సమయాన్ని రాత్రి 9 వరకు పొడిగించడం లాంటి నిర్ణయాలు వైరస్ వ్యాప్తికి మరింత దోహదం చేస్తాయని జనం అంటున్నారు. మొదట్లో కరోనా ప్రభావం విపరీతంగా ఉన్న ఢిల్లీ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ప్రస్తుతం పరిస్థితులు మారాయి. కేసుల నమోదులో తగ్గుదల కనిపిస్తోంది. కానీ మన రాష్ట్రంలో మాత్రం పెరుగుతూ పోతోంది. దీన్నిబట్టి నియంత్రణ చర్యలు పెద్దగా లేవని స్పష్టంగా కనిపిస్తోంది. ఇక సర్కార్ పెద్ద సంఖ్యలో కోవిడ్ కేర్ హాస్పిటళ్లు కడుతున్నామని, రోగంతో వచ్చిన వారికి బెడ్ లేదని అనడం మానవత్వం అనిపించుకోదని సీఎం చెబుతున్నా కింది స్థాయిలో సిట్యుయేషన్ దయనీయంగాంనే ఉంది. చాలా చోట్ల రోగులు అసౌకర్యాలతో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి టెస్టుల విషయంలో ఎలాగైతే ప్రభుత్వం దూకుడు చూపుతోందో నియంత్రణ చర్యల్లో కూడా అలాంటి దూకుడే చూపితే బాగుంటుంది.