Drushyam : ‘దృశ్యం’ లోంచి స్క్రీన్ ప్లే టిప్స్!

Drushyam : వెంకటేష్, మీనా, వాళ్ళిద్దరి కూతుళ్ళుగా నటించిన కృతిక, ఎస్తర్ ల ‘దృశ్యం 1’, ‘దృశ్యం 2’ లు చూస్తే మూడు థ్రిల్లర్ నవలలు గుర్తుకొస్తాయి. ప్రపంచ ప్రఖ్యాత థ్రిల్లర్ మాస్టర్ జేమ్స్ హేడ్లీ ఛేజ్ రాసిన నవలలు- ‘ఏన్ ఏస్ అప్ మై స్లీవ్’ (1971), ‘ది జోకర్ ఇన్ ది ప్యాక్’ (1975), ‘ఐ హోల్డ్ ది ఫోర్ ఏసెస్’ (1977) … ఈ మూడు నవలల్లో హెల్గా రాల్ఫ్ అనే మల్టీ మిలియనీర్ నడివయసావిడ, ఆమె ప్రత్యర్ధి మాజీ లవర్ జాక్ ఆర్చర్ వుంటారు. మొదటి నవల్లో లైంగిక కోర్కెలు ఎక్కువున్న హెల్గా, ఆమె మల్టీ మిలియనీర్ భర్త హెర్మన్ రాల్ఫ్, ఆమె లవర్ జాక్ అర్చర్ పరిచయ మవుతారు.

1.ఆర్చర్ ప్లాను ప్రకారమే హెర్మన్ ని పెళ్ళి చేసుకుంటుంది హెల్గా. రాల్ఫ్ దగ్గరున్న సంపదని కొట్టేసే ప్లాను. కానీ ఆమె మనసు మార్చుకుని ఎదురు తిరుగుతుంది. ఆర్చర్ కి మండిపోయి ఆమెని రకరకాలుగా ఇరికించి సంపద కొట్టేయాలని చూస్తాడు. అతడికంటే తెలివైన ఆమె ఎక్కడా దొరకదు. చివరికి ఓడిపోయిన ఆర్చర్ రెండో నవల్లో తిరిగి వచ్చి ఆమె లైంగిక కోర్కెలకి ఒక కుర్రాణ్ణి ఎరగా వేసి ఇంకో ప్లాను అమలు చేస్తాడు. అక్కడా ఆమె దొరక్క ఓడిపోతాడు. మూడో నవల్లో ఇంకో ప్లాను… ఇలా మొదటి నవల, దాని రెండు సీక్వెల్స్ ఊపిరిబిగబట్టి చదివింపజేసే సస్పెన్స్ తో, థ్రిల్స్ తో వుంటాయి… హెల్గా రాల్ఫ్ క్లాసిక్ పాత్ర ‘దృశ్యం 1’, ‘దృశ్యం 2’ లలో అదే హత్య కేసులో పోలీసులకి దొరక్కుండా పథకా లేసే వెంకటేష్ పాత్ర లాంటిదే. ఇక్కడ పోలీసులైతే, నవలల్లో జాక్ ఆర్చర్ ప్రత్యర్ధి.

ఇక మలయాళంలో ‘దృశ్యం 3’ కూడా తయారవుతోంది. ఒకే నట వర్గంతో ఇంత ఇంట్రెస్టింగ్ సీక్వెల్స్ ఈ మధ్యకాలంలో రాలేదు. చెప్పొచ్చేదేమంటే, పై మూడు ఛేజ్ నవల్స్ ని తెలుగులో ట్రయాలజీగా తీయొచ్చు.

2. మనం పుట్టక మునుపు ‘దొంగ రాముడు’ (1955) స్క్రీన్ ప్లే ముచ్చట్లు చూద్దాం. ఆ రోజుల్లోనే ఇంత గొప్పతనం పుట్టించారు. ఎవరు? దర్శకుడు కెవి రెడ్డి, రచయిత డివి నరసరాజు. ప్రారంభంలో చిన్న దొంగ రాముడు తల్లికి మందుల కోసం దొంగగా పట్టుబడి, తల్లి మరణించి, చెల్లెలు ఆనాథ అవడం ప్లాట్ పాయింట్ వన్ మలుపుగా వుంటుంది. దీని తర్వాత కథ – అంటే మిడిల్ ప్రారంభమవుతుంది. ఈ మిడిల్లో చిన్న దొంగ రాముణ్ణి బాల నేరస్థుల కేంద్రంలో వేస్తారు. దీనికి మ్యాచింగ్ సీనుగా అటు చెల్లెలు లక్ష్మిని అనాధాశ్రమంలో చేర్పిస్తారు. వెంటనే దీని తర్వాతి సీనులో అనాధాశ్రమం నుంచి కాలేజీకి బయల్దేరుతున్న పెద్దయిన లక్ష్మి (జమున ఎంట్రీ) ని చూపిస్తారు. ఆ వెంటనే అటు బాలనేరస్థుల కేంద్రంలో కారు తుడుస్తున్న పెద్దయిన దొంగరాముణ్ణి (అక్కినేని నాగేశ్వరరావు ఎంట్రీ) చూపిస్తారు. ఈ మ్యాచ్ కట్స్ తో టైం లాప్స్ అంతా చూపించేస్తారు. అంతేగానీ కాల చక్రం గిర్రున తిరిగినట్టు వలయాకారంలో చూపించే ఎలాటి ఆప్టికల్స్ లేవు. తర్వాత్తర్వాత ఆప్టికల్స్ తో ఎడిటింగ్ కాలుష్యమయ మవుతూ ఆఖరికి ఏమైందంటే, ఇప్పుడు ఆప్టికల్స్ అంటేనే చిరాకుపడే పరిస్థితి ప్రేక్షకులకి కూడా వచ్చిందని ఇటీవల ఒక ఎడిటర్ చెప్పారు. దృశ్యాలు శుభ్రంగా, సహజంగా వుండాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారనీ, నటుల భావోద్వేగాల్ని ఎడిటింగ్ తో డిస్టర్బ్ చేయకుండా, పదేసి షాట్లు వేయకుండా- ఒక్క స్టడీ షాట్ తో ఏకాగ్రతని పెంచేలా వుంటే ప్రేక్షకులకి నచ్చుతోందని చెప్పుకొచ్చారు.

3. నేను మిస్టరీలు తీయను, సస్పెన్సులే తీస్తానన్నాడు సస్పెన్స్ బ్రహ్మ ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్. ఎందుకంటే మిస్టరీల్లో కూర్చోబెట్టే థ్రిల్ వుండదు. చివర్లోనే కథేమిటో, అసలేం జరిగిందో సస్పెన్స్ అంతా ఓపెనవుతుంది. అంతవరకూ ప్రేక్షకులు గోళ్ళు గిల్లుకుంటూ కూర్చోవడమే. ఇలా కాక సస్పెన్స్ కథలో ఇప్పుడేం జరుగుతుందో, ఇంకేం జరుగుతుందో నన్న అనుక్షణ యాక్షన్ లో వుంటుంది సస్పెన్స్. మిస్టరీలు జడప్రాయమైన ఎండ్ సస్పెన్స్ లైతే, సస్పెన్సులు చైతన్యవంతమైన సీన్ టు సీన్ ఉత్కంఠ రేపే సస్పెన్సులు. కాబట్టి హిచ్ కాక్ మిస్టరీలు ఎందుకు తీయనన్నాడో అసలంటూ అర్ధమైతే, ఎండ్ సస్పెన్స్ సినిమాలు తీస్తూ చేతులు కాల్చుకోరు. కానీ మన ఇండియన్ సినిమాల్లో అదేం అలవాటో గానీ, మర్డర్ కథ అనగానే వీరావేశంతో ఎండ్ సస్పెన్స్ మిస్టరీలు తీసెయ్యడమే. సస్పెన్స్ అంటే చిట్ట చివరి వరకూ రహస్యం దాచడమే అనుకుంటున్నారు. ఇది తప్పు.

4. అంతంత మాత్రం కాన్ఫ్లిక్ట్ తో లైటర్ వీన్ ప్రేమలే తీయడానికి ఇంకా ఉత్సాహం చూపిస్తున్నారే తప్ప, అవి అట్టర్ ఫ్లాపవుతున్నాయని తెలుసుకోవడం లేదు కొత్తగా విడుదలైన ‘అనుభవించు రాజా’ సహా. ఇక ఇష్టమైనట్టు తీసుకోమని చెప్పాల్సి వచ్చింది. ఈ లైటర్ వీన్ సినిమాల వీర భక్తుల్ని కాపాడేందుకు ఏం చేయొచ్చాని ఆలోచిస్తూ, బ్లాగులో పాత రివ్యూలు తిరగేస్తూంటే, మలయాళ ‘మహేషింటే ప్రతీగారం’ (‘ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య’ -తెలుగు) కంటబడింది. ఇందులో ఒక పరిష్కారమేదో కనబడుతోంది. ఇది తేలికపాటి కాన్ఫ్లిక్ట్ తో వుండే కథ. ఇందులో హీరోకి తనని కొట్టిన వాణ్ణి తిరిగి కొట్టాలని గోల్. ఇంతే, చిన్నపాటి కారణంతో కాన్ఫ్లిక్ట్. ఈ స్వల్ప కారణాన్ని పట్టుకుని కథంతా నడిపితే సిల్లీగా వుంటుంది. అందుకని కొట్టిన వాడు దుబాయ్ వెళ్ళి పోతాడు. హీరో చేసేది లేక వాడు వచ్చాకే కొడదామని ఇతర వ్యాపకాల్లో పడిపోతాడు. ఆ ఇతర వ్యాపకాలు ఇద్దరు భామలతో ప్రేమలు, వాటి అతీగతీ, ఫోటోగ్రఫీలో తండ్రి నుంచి ఇంకాస్త జ్ఞానం, కుంగ్ ఫూ నేర్చుకోవడం, ఇతర కార్యక్రమాలు వగైరా వగైరా. ఇక కొట్టిన వాడు దుబాయి నుంచి రాగానే క్లయిమాక్స్ లో వాణ్ని కుంగ్ ఫూతో పబ్లిగ్గా కొట్టి పడేసి, పోయిన పరువు తిరిగి రాబట్టుకుంటాడు. అంటే స్వల్ప కారణంతో వున్న కాన్ఫ్లిక్ట్ పెండింగులో లేదా రిజర్వులో వుండేలా ప్రత్యర్ధిని కథలోంచి పంపేసి, హీరోకి ఇతర వ్యాపకాలు కల్పిస్తే, కథ రీఫ్రెష్ అయి వ్యాపకాలతో కొత్త కథనాలు పుట్టి కాన్ఫ్లిక్ట్ ని మరిపిస్తాయన్న మాట. అప్పుడు క్లయిమాక్స్ లో ప్రత్యర్థిని కథలోకి రీ ఎంట్రీ ఇప్పించి, హీరోతో ఫైటాఫైటీ పెట్టేస్తే సరిపోవచ్చన్న మాట. లైటర్ వీన్ ప్రేమ కథలు విడిపోయి కలుసుకోవడమే గా. విడిపోయినప్పుడు ఆ హీరోయిన్నో, హీరోనో ఎక్కడికో పంపేసి, ఉన్న హీరోయినుకో, హీరోకో ఇతర వ్యాపకాలు, లేదా కొత్త జీవితమేదో కల్పించి నడుపుతూ, విడిపోయిన శాల్తీని క్లయిమాక్స్ లో లాక్కొచ్చి పెండింగులో పెట్టిన కాన్ఫ్లిక్టు తేల్చేసి అచ్చిబుచ్చి తీర్చేస్తే సరిపోతుందన్న మాట. మూడున్నర కోట్లతో తీస్తే 38 కోట్లు వచ్చినందుకైనా ఈ మలయాళాన్ని ఫాలో అయితే ఎంతో కొంత మంగళ వాద్యాలేనన్న మాట!

—సికిందర్