Sankranthi Sambaralu : తెలుగునాట సంక్రాంతి అనగానే కోడి పందాలే.. అన్నట్టు తయారైంది పరిస్థితి. అక్కడా ఇక్కడా అని లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా కోడి పందాల హంగామా కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని ఉభయ గోదావరి జిల్లాతోపాటు, కృష్ణా జిల్లా.. దాంతోపాటుగా గుంటూరు జిల్లాల్లో కోడి పందాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి.
న్యాయస్థానాల తీర్పు కోడి పందాల నిర్వహణకు వ్యతిరేకంగా వున్నా, ప్రభుత్వాలు కోడి పందాలపై ఉక్కుపాదం మోపుతామని ప్రకటనలు చేస్తున్నా, ఏటా సంక్రాంతి సందర్భంగా కోడి పందాల నిర్వహణకు మాత్రం పెద్దగా ఆటంకాలు వుండడంలేదు.
ఈ ఏడాది కూడా కోడి పందాల నిర్వహణ అంగరంగ వైభవంగా సాగుతోంది. కేవలం ఉభయ గోదావరి జిల్లాల్లోనే వందల కోట్లు ఈ కోడి పందాల కారణంగా చేతులు మారుతున్నాయి. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ ఈసారి దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తోందని, ఉభయ గోదావరి జిల్లాలతో కృష్ణా, గుంటూరు జిల్లాలు కోడి పందాల విషయంలో పోటీ పడుతున్నాయనీ భావించొచ్చు.
ఖరీదైన కార్లు పొరుగు రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, కృష్ణా అలాగే గుంటూరు జిల్లాల వైపు పరుగులు పెట్టాయి. భారీ మైదానాలు సిద్ధమయ్యాయి. ఎల్ఈడీ స్క్రీన్లలో కోడి పందాల్ని అందరూ తిలకించేలా ఏర్పాట్లు చేశారు.
చాలా చోట్ల ప్రజా ప్రతినిథులు కోడి పందాల బరుల్ని హంగూ ఆర్భాటాల నడుమ ప్రారంభించినా, వాటిని అడ్డుకోవాల్సిన పోలీసు యంత్రాంగం చూసీ చూడనట్టు వ్యవహరించింది. ఏడాదికోసారి.. కేవలం మూడు రోజులు మాత్రమే సంప్రదాయ బద్ధంగా కోడి పందాలు నిర్వహిస్తుంటామని నిర్వాహకులు చెబుతున్నారు.
మరోపక్క, కొన్ని చోట్ల కోడి పందాల్ని జరగనీయకుండా పోలీసులు అడ్డుకుంటున్న సందర్భాలూ కనిపిస్తున్నాయి. అయితే, అడ్డుకున్నవి చాలా తక్కువ.. జరుగుతున్నవి చాలా చాలా ఎక్కువ.