ఆ తెలుగు డైరెక్టర్ మూడేళ్ళ తర్వాత బాలీవుడ్లో తేలాడు

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్లలో సంకల్ప్ రెడ్డి ఒకరు. 2017 లో వచ్చిన ఘాజి సినిమాతో అందరినీ తనవైపుకు తిప్పుకున్నాడు. ఇంతవరకు ఇండియన్ సినిమాలో ఎవ్వరూ టచ్ చేయని సబ్ మెరైన్ సబ్జెక్ట్ తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. దర్శకత్వంలోనూ తన ప్రతిభ కనబర్చి శభాష్ అనిపించుకున్నాడు. ఆ హిట్ తరువాత ఆయనకు ఆఫర్లు పెరుగాయి. మొదటి సినిమాతో ప్రయోగం చేసిన ఆయన రెండవ సినిమాను కూడ అలాగే చేశారు. స్పేస్ సబ్జెక్ట్ తీసుకుని అంతరిక్షం అనే సినిమా చేశాడు. అది ఆశించినంతగా ఆకట్టుకోలేదు. ఒకరకంగా చెప్పాలంటే ఫ్లాప్. దాంతో ఆయన రెండేళ్లు కనబడలేదు.

ఏ సినిమా చేస్తున్నాడు, ఎవరితో చేస్తాడు, ఎలాంటి సినిమా చేస్తాడు అనే ఊసే లేదు. ఈమధ్య ఓటీటీలో వచ్చిన పిట్ట కథలకు వర్క్ చేసినా అదేమంత ఎలివేట్ కాలేదు. ఇలా వెనకబడిపోతున్నాడేమో అనుకుంటూ ఉండగానే బాలీవుడ్లో సినిమాను ప్రకటించాడు. విద్యుత్ జమ్వల్ హీరో. సినిమాను ఆయనే నిర్మిస్తున్నాడు. ఐబి71 అనేది సినిమా టైటిల్. ఇదొక ఇంటెలిజెన్స్ ఆఫీసర్ చుట్టూ తిరిగే కథ. ఇందులోనూ చాలా ప్రయోగాలు చేస్తున్నాడు సంకల్ప్ రెడ్డి. మొత్తానికి అంతరిక్షం తర్వాత కనబడకుండా పోయిన ఆయన మూడేళ్ళ తర్వాత బాలీవుడ్ సినిమా అనౌన్స్ చేసి ఆసక్తి కలిగించాడు.