Sammeta Gandhi: వాళ్లంటే ప్రభుత్వానికి ఎందుకంత చిన్నచూపు.. ప్రభుత్వ తీరుపై సమ్మెట గాంధీ కామెంట్స్!

Sammeta Gandhi: ఈ మధ్య తెరపైకి వచ్చిన టికెట్ల పెంపు అంశంపై నటుడు సమ్మెట గాంధీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వానికి కూడా అంత చిన్నచూపు ఉండకూడదని ఆయన అన్నారు. టికెట్ల రేటు పెంచడం అనేది ముందు నుంచే వస్తున్న సంప్రదాయం కదా, ఏదైనా సినిమా విడుదల అవుతుంది అంటే, వాళ్లకిష్టం వచ్చిన రేటుకు వాళ్లు అమ్ముకోవచ్చని, అది కొనగలిగిన వారు కొంటారు, చూడాలనుకున్న వారు చూస్తారు అని ఆయన తెలిపారు.

అలా అనుకున్నపుడు అదే పద్దతి ప్రకారం వెళితే బాగుండేదని సమ్మెట గాంధీ చెప్పారు. ఇప్పుడేదో వాళ్లకు ఓట్లు వేస్తారని ఆశించి టికెట్ల రేట్లు తగ్గించేశారని ఆయన చెప్పారు. ఎంతో మంది సినీ ఇండస్ట్రీ మీద ఆధారపడి బతుకుతున్నారన్న ఆయన, ఇప్పుడిలా చేసి వాళ్ల పొట్ట కొట్టడం భావ్యమేనా అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అది కరెక్టు కాదని, సినిమా ఎలాగైనా చూడాలనుకునేవారు రూ.2000 పెట్టి కూడా మూవీ చూసే వాళ్లున్నారని ఆయన అన్నారు. కొనలేని వారు రూ.50కే సినిమా చూస్తారని, కాని మరీ 5,10 రూపాయలు పెడితే కనీసం ఎగ్జిక్యూటర్స్‌కి కూడా ఏమీ మిగలదని ఆయన స్పష్టం చేశారు.

ప్రభుత్వానికి ఇవన్ని విషయాలూ తెలుసునని, కానీ ఎవరి కక్షనో తెలియదు గానీ అది కరెక్టు కాదని ఆయన చెప్పారు. ఈ విషయంపై చిత్ర పరిశ్రమలో చాలా మంది మాట్లాడినప్పటికీ అధికారం వాళ్ల చేతిలో ఉంది కాబట్టి ఏం చేయలేకపోతున్నారని ఆయన అన్నారు. కానీ అధికారం ఎప్పుడూ ఒకరి చేతుల్లోనే ఉండదని ఆయన చెప్పారు. అదంతా పెద్ద వాళ్లందరూ వెళ్లి మాట్లాడుకొని పరిష్కరించుకోవాల్సిన విషయం అని ఆయన వివరించారు.