RRR : ‘ఆర్ఆర్ఆర్’ సినిమా దెబ్బకి పేద ప్రేక్షకులు డబ్బున్నోళ్ళైపోయారు.!

RRR : సమోసా కంటే తక్కువ ధరకి సినిమా టిక్కెట్లు అమ్మితే.! ఇదెక్కడి వింత.? అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై గతంలో విమర్శలు వెల్లువెత్తాయ్. ‘వకీల్ సాబ్’ సినిమా సమయంలో వచ్చిన కొత్త విధానం, ‘భీమ్లానాయక్’ సినిమా వరకూ కొనసాగింది. ‘ఏం, పేద ప్రేక్షకులు సినిమా అనే వినోదాన్ని పొందకూడదా.?’ అంటూ అధికార వైసీపీకి చెందిన నేతలు తీసిన దీర్ఘాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. స్వయానా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా, టిక్కెట్ల ధరల పెంపుని కోరినవారిపై ‘పేదల వ్యతిరేకులు’ అంటూ విమర్శలు చేశారు.

కానీ, ఇప్పుడేమయ్యింది.? పేద ప్రేక్షకులంతా ఇప్పుడు డబ్బున్నోళ్ళయిపోయారేమో. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కోసం టిక్కెట్ల ధరల్ని అదనంగా 75 రూపాయలు పెంచుకునే అవకాశమిచ్చింది జగన్ సర్కారు. అంటే, పేదలెవరూ మొదటి పది రోజులపాటు ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి రావొద్దని స్వయంగా ప్రభుత్వం చెబుతోందని అనుకోవాలేమో.

నిజానికి, సినిమా అనేది వ్యాపారం. ధర ఎక్కువైతే సినిమాకి వెళ్ళాలా.? వద్దా.? అన్నది ప్రేక్షకుడి ఇష్టం. పెద్ద సినిమాలకు తొలి వారం రోజులో పది రోజులో టిక్కెట్ల ధరల పెంపుకి అనుమతిస్తే, ఆయా సినిమాలకు లాభం చేకూరుతుంది. తద్వారా మరిన్ని పెద్ద సినిమాలొస్తాయి.. సినిమా క్వాలిటీ పెరుగుతుంది. తెలుగు సినిమా ఖ్యాతి కూడా పెరుగుతుంది.

కేవలం పవన్ కళ్యాణ్ కోసం కొత్త జీవోలు తీసుకొచ్చి, మొత్తంగా సినీ పరిశ్రమను కొన్నాళ్ళపాటు ఇబ్బందులు పెట్టి, అప్పుడేమో పేదల మీద మమకారమంటూ కథలు చెబితే, ఇదిగో ఇప్పుడిలా ఆ కథలు అధికార పార్టీకే వ్యధలుగా మారిపోతాయ్. ఏం సమాధానమిచ్చుకుంటారిప్పుడు అధికార పార్టీ నాయకులు పేదలకి. ముఖ్యమంత్రి సైతం ఈ విషయమై సమాధానం చెప్పి తీరాల్సిందే.