RRR: సాక్షుల్ని ప్రభావితం చేస్తున్నారని ఆరోపిస్తూ, ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోర్టును ఆశ్రయించారు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు. అయితే, మొదట దాఖలు చేసిన పిటిషన్, కొన్ని వివరాలు సరిగ్గా లేని కారణంగా అడ్మిట్ కాలేదు. తాజాగా ఆ పిటిషన్ అడ్మిట్ అయ్యింది. సీబీఐ కోర్టు, రఘురామ పిటిషన్ ని విచారణకు స్వీకరించింది. తన పిటిషన్ విచారణకు అర్హత సాధించడం పట్ల రఘురామకృష్ణరాజు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీ రెబల్ ఎంపీ గనుక, ఆయన తన ప్రయత్నంలో తొలి అడుగు విజయవంతంగా ముందుకు వేయగలిగినందుకు ఆయనకు ఆ సంతోషం వుంటుంది. అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆ కేసులో ఏ1గా వున్నారన్నది అందరికీ తెలిసిన విషయమే. సరైన ఆధారాల్లేకుండానే రాజకీయ ఒత్తిళ్ళతో జగన్ మోహన్ రెడ్డిని, నిబంధనలకు విరుద్ధంగా గతంలో జైల్లో వుంచారన్నది వైసీపీ ఆరోపణ. జగన్ సైతం పలు సందర్భాల్లో ఇవే తరహా వ్యాఖ్యలు చేశారు.
సరే, ఆ కేసు అప్పటినుంచి ఇప్పటిదాకా అలా అలా సాగుతోన్న విషయం అందరికీ అర్థమవుతూనే వుంది. ప్రజా కోర్టులో తన నిర్దోషిత్వం నిరూపించేసుకున్నట్లు జగన్ తరఫున వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ఇక, బెయిల్ మీద వున్నారు గనుక, షరతులకు లోబడి వుండాల్సింది పోయి, సాక్షుల్నీ, తనలాంటివారినీ బెదిరిస్తున్నారని రఘురామకృష్ణరాజు, కోర్టను ఆశ్రయించడం ఆసక్తికరమైన మలుపుగానే చెప్పుకోవాలి.
అయితే, వైఎస్ జగన్ ప్రభుత్వంపైనా, వైఎస్సార్సీపీ పైనా, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపైనా రఘురామ ఇటీవలి కాలంలో చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఇది కూడా రాజకీయ పరమైన పిటిషన్ అనే విమర్శలు ఖచ్చితంగా వస్తాయి. వాదనల్లో కూడా ఆ ప్రస్తావన రావొచ్చేమో. మరి, న్యాయస్థానం ఈ పిటిషన్ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది.? రఘురామ అంచనాల ప్రకారం జగన్ బెయిల్ రద్దవ్వాలి. కానీ, అవుతుందా.? వేచి చూడాల్సిందే.