ఇండియన్ సినిమా చరిత్రలోనే భారీ వ్యయంతో నిర్మితమవుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఇద్దరు స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటిస్తుండటం, బాహుబలి తర్వాత రాజమౌళి నుండి వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు, ఆసక్తి నెలకొని ఉంది. బడా నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ హెవీ అమౌంట్ చెల్లించి సినిమా డిజిటల్, శాటిలైట్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ సంస్థ నుండి అనేక ఇతర సంస్థలు హక్కులను కొనుగోలు చేశాయి. ఇక థియేట్రికల్ హక్కుల సంగతి చెప్పనక్కర్లేదు. అన్ని భాషల రైట్స్ సేల్ అయిపోయాయి. ఈ హక్కులన్నీ అమ్మడం ద్వారా నిర్మాత డివివి దానయ్యకు పెట్టిన బడ్జెట్ కంటే భారీ ఆదాయం వచ్చింది.
ఇక మిగిలిందల్లా సినిమా విడుదలే. అందుకే అందుకు సన్నాహాలు స్టార్ట్ చేశారు. ప్రేక్షకుల్లో సినిమా మీద మరింత ఆసక్తి కలిగేలా చేయడం కోసం ప్రమోషన్స్ మొదలుపెడుతున్నారు. అందులో భాగంగా మేకింగ్ వీడియోను రెడీ చేస్తున్నారు. ఇందులో సినిమాలోని కీలక ఘట్టాలను ఎలా తెరకెక్కించారు అనేది చూపించనున్నారు. దీన్ని జూలై 15వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ఒకరకంగా ఈ వీడియో ఆర్ఆర్ఆర్ ప్రచారానికి శ్రీకారం అనుకోవచ్చు. దీనితర్వాత వరుసగా అప్డేట్స్ ఉండనున్నాయి. పాటలు, ట్రైలర్లు, సినిమాకు సంబంధించిన పలు కార్యక్రమాలు ఉంటాయట.