వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన ఫిలిం మేకర్ రామ్ గోపాల్ వర్మ, తాజాగా ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ ఎన్నికల నేపథ్యంలో తలెత్తిన ‘సినీ రాజకీయ రగడ’పై తనదైన స్టయిల్లో స్పందించాడు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ వ్యవహారాల్ని ‘సర్కస్’తో పోల్చాడు వర్మ.
నిజానికి, వర్మ ఎప్పుడో ‘మా’ ఎన్నికల మీద స్పందించాల్సి వుంది. ఎందుకంటే, ఇలాంటి విషయాలంటే ఆయనకు బహు ఇష్టం. పైగా, మెగా క్యాంపుకి వ్యతిరేకంగా జరిగిన సినీ రాజకీయ కుట్ర కాబట్టి, ఇందులో వర్మ తన మార్కు సెటైర్లు వేసి వుండాలి. మంచు క్యాంపు అంటే వర్మకీ మహా మమకారమెక్కువ.
కానీ, ఎక్కడో తేడా కొట్టింది. వర్మ, కాస్త లేటుగా స్పందించాడు. అయితేనేం, ‘సర్కస్’ అంటూ సరైన సెటైరే వేశాడు. ఇంతకీ, వర్మ వేసిన ‘సర్కస్’ సెటైర్ గురించి ఎలా అర్థం చేసుకోవాలి.? ఎవరికి వారు తమకు తోచిన విధంగా సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు.. దానికి మళ్ళీ మీడియాలో స్పెషల్ అటెన్షన్.
దటీజ్ వర్మ.. వర్మ ఏం చేసినా.. ఆ రూటే సెపరేటు. అందుకే వర్మ నుంచి ట్వీటొచ్చినా.. వర్మ నుంచి ఏదన్నా మాట బయటకొచ్చినా.. దానికి అంత క్రేజ్. ఒకప్పటి సంచలనాల దర్శకుడు, ఇప్పడిలా వివాదాల దర్శకుడు.. సోషల్ మీడియాలో ట్రోలింగ్ దర్శకుడైపోయాడు.