MAA: ‘నాన్ లోకల్’ ఇష్యూపై వర్మ సెటైర్లు..! ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణనూ వదల్లేదు..

MAA: ప్రస్తుతం టాలీవుడ్ లో మా అసోషియేషన్ ఎన్నికల అంశం హీటెక్కుతుంటే.. అందులో నాన్ లోకల్ అంశం హోరెత్తిపోతోంది. ప్రకాశ్ రాజ్ మా అధ్యక్ష పదవికి పోటీ చేస్తూండటంతో ఈ నాన్ లోకల్ అనే విషయం తెర పైకి వచ్చింది. దీంతో.. ఈ వాదన కొత్తగా ఉందంటూ ప్రకాశ్ రాజ్ కూడా ఇటివలి ప్రెస్ మీట్ లో అన్నారు. ఇప్పుడీ విషయంపై కాంట్రవర్సియల్ డైరక్టర్ రామ్ గోపాల్ వర్మ స్పందించారు. తనదైన శైలిలో నాన్ లోకల్ అంశంపై స్పందించి వార్తల్లో నిలిచారు. ఈమేరకు ట్విట్టర్లో తన అభిప్రాయాలను ప్రశ్నలుగా అడిగేశాడు. ఈక్రమంలో ఎన్టీఆర్ నుంచి రజినీకాంత్ వరకూ అందిరినీ నాన్ లోకల్ అంశంలో కలిపేశాడు.

ఆర్జీవీ ఏమన్నాడంటే.. ‘కర్ణాటక నుంచి వచ్చిన ప్రకాశ్ రాజ్ నాన్ లోకల్ అయితే.. గుడివాడ నుంచి చెన్నైకి వెళ్లిన రామారావు గారు, నాగేశ్వర రావు గారు, బుర్రిపాలెం నుంచి మద్రాస్ వెళ్లిన కృష్ణ గారు, తిరుపతి నుంచి మద్రాస్ బయలుదేరిన మోహన్ బాబు గారు లోకలా??? ఎలా ఎలా ఎలా? మహారాష్ట్ర నుంచి ఎక్కడెక్కడికో వెళ్లిన రజినీకాంత్ గారు, ఉత్తరప్రదేశ్ నుంచి మహారాష్ట్రకి వెళ్లిన అమితాబ్ బచ్చన్ గారు లోకలా??? ఎలా? ఎలా? ఎలా?’ మీరంతా ప్రేమించే హీరోయిన్స్ అందరూ నాన్ లోకల్.. మైఖేల్ జాక్సన్ నాన్ లోకల్, బ్రూస్ లీ నాన్ లోకల్, రాముడు సీత కూడా నాన్ లోకల్’ అంటూ వరుస ట్వీట్లతో చెలరేగిపోయాడు. మా ఎలక్షన్స్ అనే హ్యాష్ ట్యాగ్ ను వీటికి జోడించాడు.

దీంతో.. అసలే రగులుకుంటున్న మా ఎన్నికల అంశంపై మరింత ఆజ్యం పోశాడు. నాన్ లోకల్ అనే ఇష్యూపై జరుగుతున్న వాదనను తనదైన శైలిలో ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ వర్మ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. నెటిజన్లలో కొందరు వర్మతో ఏకీభవించేవారు.. వ్యతిరేకించేవారూ ఉన్నారు. దీనిపై పరిశ్రమ వర్గాల నుంచి ఏమైనా స్పందన వస్తుందేమో చూడాలి. ఇప్పటికే ప్రకాశ్ రాజ్ ప్యానల్ ఇప్పటికే మీడియా సమావేశం నిర్వహించింది. ప్రకాశ్ రాజ్ కు నాగబాబు మద్దతిచ్చి మెగా ఫ్యామిలీ ముద్రను చూపించారు. మరోవైపు మంచు ఫ్యామిలీ, జీవిత, హేమ.. కూడా ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. దీంతో పోటీ రసవత్తరంగా మారింది.